లాకప్‌లో వేయండి.. ఎవరొస్తారో చూద్దాం! | Sakshi
Sakshi News home page

లాకప్‌లో వేయండి.. ఎవరొస్తారో చూద్దాం!

Published Tue, May 15 2018 9:37 AM

Police Officials Threaten Complaints In Ananthapur - Sakshi

ఒకే శాఖ. అందునా కిందిస్థాయి ఉద్యోగి. కుటుంబ పెద్దగా వ్యవహరించాల్సిన ఉన్నతాధికారి తన హోదా మరిచి వ్యవహరించాడు. అవసరమైతే అతనికి సహాయం చేయాల్సింది పోయి.. అతని డబ్బుకే ఎసరు పెట్టాడు. కుటుంబ సమస్యల నేపథ్యంలో ‘సార్‌.. డబ్బు తిరిగివ్వండి’ అని అడిగిన పాపానికి ఓ      కానిస్టేబుల్‌ను ‘వీడిని లాకప్‌లో వేయండిరా.. ఎవరు అడ్డొస్తారో చూద్దాం’ అని గద్దించిన ఘటన అనంతపురం నాల్గో పట్టణ పోలీసుస్టేషన్‌లో చోటు చేసుకుంది.

అనంతపురం సెంట్రల్‌: నాల్గో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఓ అధికారి వ్యవహార శైలి తవ్వేకొద్దీ కొత్త విషయాలతో ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫిర్యాదుదారులు ఆ స్టేషన్‌ మెట్లెక్కేందుకే జంకుతుంటే.. సొంత శాఖ సిబ్బంది కూడా ఆయన చేష్టలతో వణికిపోతున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే రిపోర్టు రాసి సస్పెండ్‌ చేయిస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. ‘సాక్షి’లో గత రెండు రోజులుగా వరుస కథనాల నేపథ్యంలో బాధితులు ఒక్కొక్కరుగా తమకు జరిగిన అన్యాయాలను ఏకరువు పెడుతున్నారు. ఈ కోవలోనే అదే స్టేషన్‌లో పని చేస్తూ దీర్ఘకాలిక సెలవులో వెళ్లిన ఓ కానిస్టేబుల్‌ సైతం ఆయనను అవమానాల పాలు చేసిన విషయాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. రక్షక్‌ వాహనానికి డ్రైవర్‌గా పని చేస్తున్న సదరు ఏఆర్‌ కానిస్టేబుల్‌ ఇటీవల అధికారి వేధింపులు తాళలేక దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయాడు.

అందుకు కారణాలను పరిశీలిస్తే.. ఓసారి వాహనం మరమ్మతుకు లోనైంది. విషయాన్ని అధికారి దృష్టికి తీసుకెళ్తే.. ‘‘డబ్బు సర్దుబాటు చేసుకొని మరమ్మతు చేయించు.. స్టేషన్‌కు ఏదైనా డబ్బు వస్తే సర్దుబాటు చేస్తా’’నని చెప్పాడు. పై అధికారి కావడంతో సదరు కానిస్టేబుల్‌ తన జేబు నుంచి వాహనానికి మరమ్మతులు చేయించాడు. ఆ తర్వాత రెండు నెలలైనా పట్టించుకోకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ‘సార్‌.. డబ్బు సర్దుబాటు చేయండి’ అని కోరాడు. చూద్దాంలే అని చెప్పి.. మరో ఆరు నెలలు గడిచినా అధికారి నుంచి స్పందన లేకపోయింది. ఇటీవల తిరిగి డబ్బు అడగటంతో రెచ్చిపోయిన అధికారి స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే ‘వీడిని లాకప్‌లో వేయిండిరా.. ఎవరు అడ్డొస్తారో చూద్దాం’ అంటూ దుర్భాషలాడినట్లు సమాచారం. అధికారికి ఎదురొడ్డి నిలవలేని ఆ కానిస్టేబుల్‌ దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయాడు. అయితే ఈ బాధితుడు తనకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగానే చెబుతున్నా.. బయటకు చెప్పుకోలేని ఉద్యోగులు కొందరు లోలోపల మదనపడుతున్నారు.

స్టేషన్‌ అవసరాల పేరిట వసూళ్లు
సమస్యలతో పోలీసుస్టేషన్‌ మెట్లెక్కితే చాలు.. స్టేషన్‌ అవసరాల పేరిట ముక్కుపిండి వసూలు చేయడం పరిపాటిగా మారింది. కక్కలపల్లి సమీపంలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్‌ విద్యార్థి చనిపోతే స్టేషన్‌కు చెందిన బొలెరో వాహనం మరమ్మతుల పేరిట వేలల్లో డబ్బు గుంజినట్లు సమాచారం. స్టేషన్‌ అవసరాల పేరిట లక్షల్లో వసూళ్లు చేస్తున్నా.. రక్షక్‌ వాహన మరమ్మతుకు తన చేతి నుంచి డబ్బు పెట్టుకున్న కానిస్టేబుల్‌కు తిరిగి చెల్లించకపోవడం గమనార్హం. ఇకపోతే సదరు అధికారికి ఇద్దరు కానిస్టేబుళ్లు అంతా తామై వ్యవహరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. రాత్రిళ్లు ఆయనతో పాటు తనిఖీకి వెళ్లిన సమయంలో హైవేపై వచ్చివెళ్లే వాహనాల నుంచి డబ్బు గుంజడం.. రాంనగర్‌లోని ఓ బార్, టీ కేఫ్‌ల వద్ద వసూళ్ల విషయంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్టేషన్‌కు వచ్చే కేసుల విషయంలోనూ డబ్బు వ్యవహారం ఆ ఇద్దరు కానిస్టేబుళ్లే చక్కబెడుతున్నట్లు సమాచారం.

ఉన్నతాధికారి అండదండలతో..
ఈ ‘నాల్గో’ సింహం పనితీరు ఉన్నతాధికారులకు తెలియనిది కాదు. అయితే జిల్లా స్థాయిని మించి ఓ ఉన్నతాధికారి అండదండలు ఉండటంతో ఇక్కడ ఆయన ఆటలు సాగిపోతున్నట్లు చర్చ జరుగుతోంది. బాధితులు జిల్లా ఎస్పీకి స్వయంగా ఫిర్యాదు చేసినా ప్రతిసారీ ఆ ఉన్నతాధికారి వద్దకు వెళ్లి సర్దుబాటు చేయించుకుంటున్నట్లు తెలిసింది. ఇకపోతే ఓ మంత్రి సోదరునికి నమ్మిన బంటుగా ఉంటున్న ఈ అధికారి ఆయన చెప్పిన ప్రతి కేసునూ సెటిల్మెంట్‌ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా అధికారిపై ఆరోపణలు తీవ్రం కావడంతో మంత్రి సోదరునితో ఉన్నతాధికారులకు సిఫారసు చేయిస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసు శాఖ ప్రతిష్టకే భంగం కలిగే పరిస్థితి ఉండటంతో ఉన్నతాధికారులు సదరు అధికారి విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.

18 తులాలకు.. రెండే!
గతేడాది నగరంలోని రాంనగర్‌లో సుధారాణి, ప్రవీణ్‌కుమార్‌ దంపతుల ఇంట్లో దొంగలు పడి 18 తులాల బంగారం దోచుకెళ్లారు. బాధితుడు నాల్గవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల దొంగను పట్టుకున్న పోలీసులు చోరీ సొత్తు రికవరీ చేశారు. బాధితులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించిన ఆ పెద్దపోలీసు 2 తులాలు తీసుకొని 18 తులాలకు అంగీకారం తెలిపినట్లు సంతకం చేయాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఇదెక్కడి న్యాయమని బాధితులు ప్రశ్నిస్తే నాకే ఎదురు తిరుగుతావా అంటూ విరుచుకుపడినట్లు తెలిసింది. దీంతో బాధితులు సదరు అధికారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. చోరీ సొత్తు రివకరీ విషయంలోనూ సదరు అధికారి చేతివాటం చూపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement
Advertisement