ఏం పాపం చేశానని..

Parents Leave New Born Baby in Dust Bin Guntur - Sakshi

ముళ్లపొదల్లో పసికందు

పుట్టిన 24 గంటలు గడవక ముందే ప్రాణాలు విడిచిన చిన్నారి

మాచవరం మండలం చెన్నాయిపాలెంలో ఘటన

మాచవరం: ఆ కన్నతల్లికి ఏం కష్టం వచ్చిందో...ఒక్క రోజు పసికందును నిర్దాక్షిణ్యంగా వదిలివెళ్లింది. భూమ్మీదకు వచ్చి 24 గంటలు కూడా గడవకుండానే ఓ ఆడ బిడ్డకు నూరేళ్లు నిండాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఒక రోజు పసికందును ఖాళీ స్థలంలో వదిలివెళ్లగా, ఆ పసికందు ఏడుపులు విని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే  స్పందించి ఆ బిడ్డను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించినా ప్రయోజనం లేకుండా పోయింది. వివరాలిలా ఉన్నాయి. ఈ అమానుష ఘటన మాచవరం మండలంలోని చెన్నాయిపాలెం గ్రామంలో చోటు చేసుకుంది.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...చెన్నాయిపాలెంలో బాణావత్తు దత్తునాయక్‌ ఇంటికి  వెనుక ఖాళీ స్థలంలో బుధవారం రాత్రి  పది గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కేవల ఒక్క రోజు వయస్సు ఉన్న ఆడ శిశువును వదిలేసి వెళ్లారు. ఆ పసికందు ఏడుపులు విని దారినపోయే వారు   గుర్తించారు. 

ఆ పసికందు ఎక్కడి నుంచి వచ్చింది. గ్రామంలో ఒక రోజు క్రితం ఎవరు ప్రసవించారు ఆని  ఆరా తీయగా సమాచారం లభించలేదు. దీంతో ఎక్కడ నుంచో తీసుకుని వచ్చి ఈ ప్రదేశంలో వదిలేసి ఉంటారని గ్రామస్తులు భావిస్తున్నారు. గ్రామస్తులు మాచవరం పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించగా, పసికందుకు వైద్యం అందించేందుకు  మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి  తరలించారు. వైద్యశాలలో  చికిత్స  పొందుతూ ఆ  ఆడపిల్ల  గురువారం కన్నుమూసింది. పసికందు దొరికిన సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ లక్ష్మీనారాయణరెడ్డి పరిశీలించారు. సీడీపీవో శ్రీవల్లి, సెక్టార్‌ సూపర్‌వైజర్‌  రమాదేవి శిశుమరణాలు తమ పరిధిలోకి  వస్తాయని, మృతి చెందిన పాపను తమకు అప్పగించాలని వారు కోరారు. మాచవరం  ఎస్‌ఐ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top