ఆస్తికోసం తల్లిదండ్రుల గెంటివేత

Parents Complaint Against Sons - Sakshi

ఇంటికి తాళం వేయడంతో పోలీసులను ఆశ్రయించిన వృద్ధులు

న్యాయం చేయాలని వేడుకోలు

సంగెం(పరకాల) : దేశమంతా ఫాదర్స్‌ డే వేడుకలు జరుపుకుంటున్నారు.. కనిపెంచిన వారి గొప్పతనాన్ని చెప్పుకుంటున్నారు.. ఇదే సమయంలో ఆస్తికోసం వృద్ధులైన తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటివేయడంతో పోలీసులను ఆశ్రయించిన సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం లోహిత గ్రామంలో చోటుచేసుకుంది. బాధిత దంపతుల కథనం ప్రకారం.. లోహిత గ్రామానికి చెందిన బొనగాని వీరమల్లు, కళమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు.

వీరమల్లు కల్లుగీత వృత్తిపై, భార్య కూలినాలి చేసి కష్టపడి ఏడు ఎకరాల భూమి సంపాదించారు. ఆ భూమిలో రెండున్నర ఎకరాలు కళమ్మ పేరుతో, రెండు ఎకరాల పొలం చిన్న కొడుకు శ్రీనివాస్‌ పేరుతో, మరో రెండున్నర ఎకరాలు పెద్దకొడుకు వెంకటేశ్వర్లు పేరుతో పహాణీలో ఉంది. తల్లిదండ్రులు పిల్లలకు వివాహం చేశారు. ఈ క్రమంలో చిన్న కూతురుకు కట్నంతోపాటు పసుపు కుంకుమల కింద ఎకరం పొలం రాసిచ్చారు.

మరో ఎకరం తమ వద్ద ఉంచుకుని మిగిలిన ఐదు ఎకరాలను ఇద్దరు కుమారులకు చెరి సగం పంచి ఇచ్చారు. అయితే చిన్న కుమారుడు శ్రీనివాస్‌ తన పేర పహాణీలో ఉన్న రెండు ఎకరాల పొలాన్ని ఇటీవల సాదాబైనామా ద్వారా పట్టా చేయించుకున్నాడు. దీంతో చెల్లితోపాటు మా పరిస్థితి ఏంటని తండ్రి ప్రశ్నించగా కళమ్మ పేర ఉన్న భూమిని మీరే దున్నుకోండి అని చెప్పాడు. ఇటీవల ఆ చెల్కను ఇద్దరు కొడుకులు కలిసి దున్నుకుంటుండగా ‘పోలం తీసుకున్నారు.

చెల్క కూడా తీసుకుంటే మేం ఎట్లా బతుకాలి’ అని అడ్డుకోబోయిన తండ్రిపై కొడుకులు దాడి చేసి చంపుతామని బెదిరించారు. దీంతో వీరమల్లు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా శ్రీనివాస్‌తోపాటు వెంకటేశ్వర్లును తీసుకురమ్మని ఎస్సై దీపక్‌ కానిస్టేబుల్‌ను శనివారం గ్రామానికి పంపాడు. కానిస్టేబుల్‌ ముందే ఇద్దరు కోడళ్లు అత్తమామలైన వీరమల్లు, కళమ్మను దుర్భాషలాడుతూ ఇంట్లోంచి గెంటివేసి తాళం వేసుకున్నారు.

అప్పటికే రాత్రి కావడంతో  గ్రామంలోని తెలిసిన వారి ఇంట్లో తలదాచుకుని ఆదివారం సర్పంచ్, ఎంపీటీసీలకు ఫిర్యాదు చేశారు. అయినా ఇంటి తాళం తీయకపోగా చంపుతామని కొడుకులు బెదిరించడంతో ఆ వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా వీరమల్లు, కళమ్మ మాట్లాడుతూ ‘కనీ పెంచి పెద్ద చేసినం.. పెళ్లిళ్లు చేసి చెరో ఇళ్లు కట్టించడంతో పాటు ఉన్న భూమి పంచి ఇచ్చినం.. మేమూ ఇల్లు కట్టుకుని వాళ్లమీద ఆధారపడకుండా బతుకుతున్నం.

ఉన్న భూమి తీసుకొని చంపుతామని బెదిరిస్తున్నరు.. కొడుకుల నుంచి రక్షణ కల్పించి మా భూమి మాకు ఇప్పించాలి’ అని వేడుకున్నారు. ఈ విషయంపై ఎస్సైని వివరణ కోరగా తల్లిదండ్రులను ఇంటికి తాళం వేసి వెళ్లగొట్టిన మాట వాస్తవమే అని.. ఇద్దరు కుమారులను పిలిచి మాట్లాడి వృద్ధులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top