బాలికపై పోలీస్‌ లైంగికదాడి.. గర్భస్రావం | Sakshi
Sakshi News home page

భక్షక భటులు

Published Sat, Jun 27 2020 7:13 AM

Odisha Police Ans Station Staff Molestation on Girl Child - Sakshi

బోయవాడి వేటుకు గాయపడిన కోయిలలా..గాలి వాన బీభత్సానికి వణికిపోయిన చిగురుటాకులా..పులి పంజాకు చిక్కిన జింకలా..రక్షక్ష భటుల వికృత చేష్టలతో ఓ బాలిక విలవిల్లాడింది. ప్రజలను కాపాడాల్సిన పోలీసులే కంచే చేను మేసిందన్న చందాన వ్యవహరించడంతో ఓ అమాయక బాలిక వారి కబంధ హస్తాల్లో చిక్కుకుని గిలాగిలా కొట్టుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ అమానుష సంఘటన వివరాలిలా ఉన్నాయి.     

ఒడిశా, భువనేశ్వర్‌: సుందరగడ్‌ జిల్లాలోని బీరమిత్రపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌చార్జి ఆనంద చంద్ర మఝి, ఇతర పోలీస్‌ సిబ్బంది 13 ఏళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడి, గర్భస్రావం చేయించిన విచారకర సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాలికపై లైంగికదాడికి పాల్పడి అనంతరం గర్భస్రావం చేయించిన నేరారోపణ కింద బీరమిత్రపూర్‌ పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌చార్జి ఆనంద చంద్ర మఝిపై సస్పెన్షన్‌ వేటు పడింది. రాష్ట్ర డీజీపీ అభయ్‌ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు  సస్పెన్షన్‌ విధించినట్లు పశ్చిమ రేంజ్‌ డీఐజీ కవిత జలన్‌  తెలిపారు. బీరమిత్రపూర్‌ పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌చార్జి, సబ్‌ఇన్‌స్పెక్టర్‌లకు వ్యతిరేకంగా శిశు సంక్షేమ కమిటీ చేసిన ఫిర్యాదు ఆధారంగా మహిళా డీఎస్పీ ఆధ్వర్యంలో బాధిత బాలిక వాంగ్మూలం నమోదు చేశారు. ఈ విచారకర సంఘటనలో బాలిక పెంపుడు తండ్రి, ఇద్దరు మిత్రులు కూడా భాగస్వాములని వాం గ్మూలంలో బాలిక వెల్లడించింది.  (ఇక భరించలేను.. ఉండలేను! )

లాక్‌డౌన్‌తో చిక్కులు
జాతర చూసేందుకు గడిచిన మార్చి 25వ తేదీన బాలిక బీరమిత్రపూర్‌ విచ్చేసింది. లాక్‌డౌన్‌ ప్రకటించడంతో రవాణా సౌకర్యాలు లేక  ఇంటికి చేరుకోలేక చిక్కుకుంది. స్థానిక బస్టాండ్‌లో ఒంటరిగా తిరుగుతున్న తరుణంలో పహారా కాస్తున్న పోలీసుల కన్ను ఆ బాలికపై పడింది. రక్షణ కల్పిస్తామని నమ్మబలికి బాలికను పోలీసులు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. స్టేషన్‌ పై అంతస్తులో బాలికకు విడిది ఏర్పాటు చేశారు. స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌చార్జి ఆనంద చంద్ర మఝి తొలి రోజున బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. మర్నాడు బాలికను ఆమె ఇంటికి చేర్చారు. 3 నెలల పాటు క్రమం తప్పకుండా స్టేషన్‌లో హాజరుకావాలని ఆదేశించారు. వచ్చిన ప్రతిసారి పై అంతస్తులో విడిది కల్పించి స్టేషన్‌లో సిబ్బంది వంతుల వారీగా బాలిక పట్ల లైంగికదాడికి పాల్పడ్డారు. ఆరోగ్యం అనుకూలించక పోవడంతో ఈ నెల 16వ తేదీన బీరమిత్రపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేయించడంతో గర్భం దాల్చినట్లు వైద్య సిబ్బంది ధ్రువీకరించారు. పోలీసు అధికారం ప్రయోగించి  బాలికకు గర్భస్రావం చేయించారు. బాలికకు రూ. 2 వేలు నగదుతో పాటు ఒక డ్రెస్‌ ఇచ్చి ఇంటికి పంపించారు.

రౌర్కెలా ఆస్పత్రిలో బయటపడిన విషయం
ఇంటికి చేరిన మర్నాడు బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో రౌర్కెలా ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం కుటుంబసభ్యులు, బంధువులు తరలించారు. ఆరోగ్య పరీక్షల సందర్భంగా అక్కడి వైద్యులు నిలదీయడంతో గర్భస్రావం పూర్వాపరాలు బంధువులకు    తెలిశాయి. దీంతో బాధిత బాలిక బంధువులు శిశు సంక్షేమ సంస్థ (చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌) సహాయం కోసం అభ్యర్థించారు. దీంతో జిల్లా శిశు సంరక్షణ అధికారి రాయిబాగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో బీరమిత్రపూర్‌ పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇన్‌చార్జి ఆనంద చంద్ర మఝి, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ దొలొమొణి నాయక్, ఇద్దరు యువకులు, బాధిత   బాలిక పెంపుడు తండ్రిని నిందితులుగా పేర్కొన్నారు. బాలికకు గర్భస్రావం చేసిన బీరమిత్రపూర్‌ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రం  వైద్యుడిని కూడా ఫిర్యాదులో నిందితుడిగా పేర్కొన్నారు. అయితే వైద్యుడు పరారీలో ఉన్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement