‘నయీం’ భూ విక్రేతల అరెస్టు

Nayeem Land sellers was arrested - Sakshi

జిరాక్స్‌ సేల్‌డీడ్‌తో భువనగిరిలో ఐదెకరాల విక్రయం 

జైలు నుంచి బయటికొచ్చి స్కెచ్‌ వేసిన పాశం శ్రీనివాస్‌ 

నయీం తమ్ముడు, భార్య, బినామీ శ్రీనివాస్‌తో కలసి ప్లాన్‌ 

రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్ల కోసం వచ్చిన ఐదుగురి అరెస్టు  

రూ.88,37,000 నగదు, మూడు కార్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు 

వివరాలు వెల్లడించిన రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ 

సాక్షి, హైదరాబాద్‌: యాదాద్రి భువనగిరి జిల్లాలో గ్యాంగ్‌స్టర్‌ నయీం బినామీల పేర్లపై ఉన్న భూ విక్రయానికి కొందరు స్కెచ్‌ వేశారు. ఇందులో భాగంగా భువనగిరిలోని 5 ఎకరాల భూమిని జిరాక్స్‌ సేల్‌ డీడ్‌తో విక్రయించారు. ఈ డాక్యుమెంట్లు తీసుకుందామని రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి వచ్చిన ఐదుగురిని రాచకొండ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ (ఎస్‌వోటీ) పోలీసులు అరెస్టు చేశారు. నయీం అనుచరులు పాశం శ్రీనివాస్, మహమ్మద్‌ అబ్దుల్‌ నాజర్, నయీం తమ్ముడు మహమ్మద్‌ అబ్దుల్‌ ఫహే, భార్య హసీనా బేగమ్, బినామీ తుమ్మ శ్రీనివాస్‌ను శనివారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి రూ.88,37,000, మూడు కార్లు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నాగోల్‌లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయంలో ఎస్‌వోటీ అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్‌ సురేందర్‌రెడ్డి, భువనగిరి ఏసీపీ భుజంగరావుతో కలసి పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ సోమవారం మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు.  

సిట్‌ చేతిలో ఒరిజినల్‌ డాక్యుమెంట్స్‌ ఉన్నా... 
భూమి యజమానులను బెదిరించి బినామీ పేర్ల మీద ఆ స్థలాలను నయీం రాయించుకున్న ఘటనలు కోకొల్లలు. అప్పట్లో నయీం వెంట దందాల్లో పాశం శ్రీనివాస్‌ పాల్గొనేవాడు. నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత ఆయా ఆస్తుల డాక్యుమెంట్లు, భూముల ఒరిజినల్‌ సేల్‌ డీడ్‌లను ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌) స్వాధీనం చేసుకుంది. ఆయా భూముల వివరాలను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పంపింది. నయీం ఎన్‌కౌంటర్‌ అనంతరం అరెస్టైన శ్రీనివాస్‌ రెండేళ్లు జైల్లో ఉన్నాడు. బయటికి వచ్చిన తరువాత భువనగిరిలోని నయీం బినామీ ఆస్తులపై దృష్టి సారించాడు. నయీం సోదరుడు అబ్దుల్‌ ఫహే, భార్య హసీనా బేగమ్, అనుచరుడు అబ్దుల్‌ నాజర్, బినామీ తుమ్మ శ్రీనివాస్‌తో కలసి భువనగిరిలోని సర్వే నంబర్‌ 730లో ఉన్న ఐదెకరాల భూమిని విక్రయించాలని నిర్ణయించాడు.

నయీం బాధితుడైన డీవీఆర్‌ కంపెనీ ఎండీ వెంకటేశ్వరరావు.. ఈ భూమికి రూ.88,37,000 ఇచ్చేందుకు అంగీకరించాడు. భూమి తుమ్మ శ్రీనివాస్‌ పేరుపై ఉండటంతో అతనికి రూ.5 లక్షలు ఇస్తానని పాశం శ్రీనివాస్‌ బేరం కుదుర్చుకున్నాడు. 5 ఎకరాల భూమిని మండపల్లి వెంకటేశ్వరరావుకు తుమ్మ శ్రీనివాస్‌ సేల్‌ కమ్‌ జీపీఏ అగ్రిమెంట్‌ చేయగా, తర్వాత ఇదే భూమిని వెంకటేశ్వరరావు బెంగళూరులోని మోక్ష డెవలపర్స్‌ అండ్‌ ప్రమోటర్స్‌ పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు రిజిస్ట్రేషన్‌ పత్రాలను తీసుకునేందుకు వచ్చిన సమయంలో వారిని అరెస్టు చేసినట్లు సీపీ చెప్పారు. జిరాక్స్‌ సేల్‌డీడ్‌తో రిజిస్ట్రేషన్‌ చేసిన అధికారుల పాత్రపై కూడా విచారణ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని మహేశ్‌ భగవత్‌ తెలిపారు.
పోలీసుల అదుపులో నయీం భార్య హసీనా బేగమ్, ఇతర నిందితులు 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top