కుమారుడి హత్య కేసులో తల్లికి..

Mother Jailed for Son's Murder Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : ఆస్తి వివాదంలో కన్న కొడుకును హతమార్చిన తల్లికి జీవిత ఖైదు, రూ.2వేలు జరిమానా విధిస్తూ గుంటూరు మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి వి.ఎ.ఎల్‌.సత్యవతి శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ నిర్వహించిన అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అంచుల వరదరాజు కథనం మేరకు 2014వ సంవత్సరంలో కాకుమాను మండలం బోడిపాలెం గ్రామానికి చెందిన బత్తినేని అంజనాదేవి కుమారుడు కోటేశ్వరరావుతో పొన్నూరు మండలం నిడుబ్రోలు గ్రామానికి చెందిన శైలజ వివాహం అయింది.

కోటేశ్వరరావుకు రెండో వివాహం కావడంతో వివాహ సమయంలో మూడున్నర ఎకరాలు కోటేశ్వరరావు పేరుమీద అతని తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్‌ చేస్తామని చెప్పడంతో శైలజతో వివాహం జరిపించారు. అనంతరం ఎకరం 67 సెంట్లను మాత్రమే కోటేశ్వరరావు తల్లిదండ్రులు అతని పేర రిజిస్ట్రేషన్‌ చేయించారు. మిగతా పొలం విషయమై కోటేశ్వరరావు తన పేరు మీద రాయాలని తల్లి అంజనాదేవిని, సోదరి ముప్పవరపు శివనాగలక్ష్మి అలియాస్‌ లక్ష్మిపై ఒత్తిడి పెంచాడు.

ఈక్రమంలో తల్లి అంజనాదేవి, సోదరి శివనాగలక్ష్మి, మేనమామ గార్లపాటి నాగేశ్వరరావు కలిసి కోటేశ్వరరావును వారి నివాసంలోనే గొడ్డలి, పచ్చడిబండతో దాడిచేసి హత్య చేశారు. అనంతరం అంజనాదేవి కుమారుడు మృతదేహాన్ని కొద్దిరోజులపాటు ఇంట్లోనే బయటి వారికి తెలియకుండా ఉంచింది. మృతదేహం దుర్వాసన వస్తుండటంతో అంజనాదేవి 2016 అక్టోబరు 19వ తేదీన మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి యూరియా గోతంలో పెడుతుండగా గ్రామస్తులు గమనించి పండుగ నిమిత్తం పుట్టింటికి వెళ్లిన మృతుడి భార్య శైలజకు సమాచారం ఇచ్చారు. 

దీంతో ఆమె బోరుపాలెం చేరుకుని కాకుమాను పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు నమోదు చేసిన సీఐ సి.హెచ్‌.వి.జి. సుబ్రహ్మణ్యం కేసు విచారించి కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. కేసు విచారించిన న్యాయస్థానం అంజనా దేవిపై నేరం రుజువు కావడంతో ఆమెకు జీవిత ఖైదు, రూ.2వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. గార్లపాటి నాగేశ్వరరావు, ముప్పవరపు శివనాగలక్ష్మిలపై కేసు రుజువు కాకపోవడంతో వారిపై కేసు కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top