తల్లీకొడుకు దారుణ హత్య

Mother And Son Murdered in Hyderabad - Sakshi

అమీర్‌పేట: తల్లీ,కొడుకు దారుణ హత్యకు గురైన సంఘటన సనత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంతి. ఇన్స్‌పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన ఊర్మిళ (27) రాజేష్‌ దంపతులు తమ కుమారుడు కిషన్‌(4)తో పాటు, ఊర్మిళ సోదరి చంద, దీపక్‌ దంపతులు 15 రోజుల క్రితం బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చి సనత్‌నగర్‌ జింకల వాడలో ఒకే ఇంట్లో ఉంటున్నారు. దీపక్‌ ఆటో నడుపుకుంటుండగా, చంద ప్రైయివేటు కంపెనీలో పనిలో చేరింది. రాజేష్, ఊర్మిళ దంపతులు ఉద్యోగం కోసం తిరుగుతున్నారు. ఆదివారం ఉదయం దీపక్, చంద దంపతులు పనికి వెళ్లగా ఊర్మిళ, రాజేష్‌ ఇంట్లోనే ఉన్నారు. మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి వచ్చిన ఊర్మిళ సోదరి చంద ఇంటికి తాళం వేసి ఉండటాన్ని చూసి అక్కా, బావ పని వెతుక్కునేందుకు బయటికి వెళ్లి ఉంటారని భావించి తిరిగి పనిలోకి వెళ్లింది. సాయంత్రం భర్త దీపక్‌ తో కలిసి ఇంటికి రాగా తాళాలు వేసి ఉండటంతో వారికి ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉన్నట్లు సమాచారం అందింది.

దీంతో తాళాలు పగులకొట్టి లోపలికి వెళ్లి చూడగా ఊర్మిళ,  కిషన్‌ విగతజీవులై కనిపించారు. ఊర్మిళ తలకు తీవ్ర గాయం కావడంతో రక్తపు మడుగులో పడి ఉంది. బాలుడు కిషన్‌ నీళ్ల బకెట్‌లో తలకిందులుగా పడి ఉన్నాడు. ముందుగా ఊర్మిళను ఇనుపరాడ్‌తో తలపై కొట్టి హత్య చేసి అనంతరం బాలుడ్ని బకెట్‌లో ముంచి హత్య చేసినట్లు గుర్తించారు. అయితే చంద, దీపక్‌ దంపతులు భయంతో సాయంత్రం వరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. స్థానికుల సాయంతో సాయంత్రం సనత్‌నగర్‌ పోలీసులకు సమాచారం అందించడంతో ఇన్స్‌పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించారు. రాజేష్‌ సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి ఉండటంతో అతడే ఈ హత్యలకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కాగా నిందితుడు రాజేష్‌కు ఏడేళ్ల క్రితం వివాహం జరగ్గా అతడి వేధింపులు తాళలేక మొదటి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం ఊర్మిళను రెండో వివాహం చేసుకున్న అతను అనుమానం తో హత్యకు పాల్పడి ఉండవచ్చునని అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top