పక్కింటి యువకుడే కాలయముడు | Mother And Son Murder Case Reveals Tamil Nadu Police | Sakshi
Sakshi News home page

పక్కింటి యువకుడే కాలయముడు

Apr 12 2019 9:25 AM | Updated on Apr 12 2019 9:25 AM

Mother And Son Murder Case Reveals Tamil Nadu Police - Sakshi

వీరలక్ష్మి (ఫైల్‌) పోతిరాజు (ఫైల్‌) హంతకుడు వెంకట్‌

చోరీకి పాల్పడుతుండగా గుర్తించడమే కారణం తల్లీబిడ్డ హత్య కేసు

తమిళనాడు, తిరుత్తణి: తల్లీబిడ్డ హత్య కేసులో పక్కింటి యువకుడే కాలయముడయ్యాడు. అతన్ని పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. తిరుత్తణి శివారులోని  పీటీ పుధూర్‌ బాలాజీ నగర్‌కు చెందిన వనపెరుమాళ్‌(45) ప్రైవేట్‌ కర్మాగారంలో సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 8న విధులు ముగించుకుని ఇంటికి వచ్చి చూడగా భార్య వీరలక్ష్మి(40), కుమారుడు పోతిరాజు(10) హత్యకు గురయ్యారు. ఇంట్లో చోరీ చేయడానికి వచ్చిన దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించాడు. హత్యకు సంబంధించి తిరువళ్లూరు జిల్లా ఎస్పీ పొన్ని మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. హత్య జరిగిన ప్రదేశంలో వేలిముద్రలను సేకరించి విచారణ చేపట్టారు.

వేలిముద్ర ఆధారంతో చిక్కిన నిందితుడు..
హత్య జరిగిన ఇంట్లో వేలిముద్రలు సేకరించిన నిపుణులు వాటి ద్వారా విచారణను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో వనపెరుమాళ్‌ ఇంటి పక్కింట్లో ఉంటున్న సత్యరాజు కుమారుడు వెంకట్‌(23)ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

హత్య చేసినట్టు అంగీకారం..
పోలీసులు వెంకట్‌ను విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. పాల వ్యాపారంలో నష్టాలు వచ్చినట్లు.. దీంతో అప్పులు తీర్చడానికి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపాడు. పక్కింటిలోని వనపెరుమాళ్‌ ఇంట్లో నగలు ఉన్నట్లు తెలిసిందన్నాడు. చోరీ చేయడానికి పథకం వేశాడు. ఈ నెల 8న వేకువజామున 4 గంటలకు ఇంట్లో చొరబడ్డాడు. అయితే శబ్దం రావడంతో ఇంటి ముందు శుభ్రం చేస్తున్న వీరలక్ష్మి ఇంట్లోకి వెళ్లింది. మొహానికి మాస్కు ధరించిన వ్యక్తిని చూసి ఆమె కేకలు వేసింది. దీంతో ఇంటి తలుపులు మూసివేసి నగలు ఇవ్వాలని బెదిరించాడు. అతన్ని వీరలక్ష్మి గుర్తించడంతో పాటు చోరీ విషయం అందరికీ చెబుతానని అరిచింది. ఆగ్రహానికి గురైన వెంకట్‌ ఇనుప రాడ్డుతో ఆమె తలపై దాడి చేసి హత్య చేశాడు. తల్లి కేకలు విన్న పోతురాజు తండ్రికి ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించాడు. దీన్ని పసిగట్టిన దుండగుడు కేబుల్‌ వైర్‌తో బాలుడి గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం 21 సవర్ల నగలను తీసుకుని పరారైనట్లు వాంగ్మూలంలో పేర్కొన్నాడు. తిరుత్తణి పోలీసులు హంతకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement