మట్కా డాన్‌ అసదుల్లా అరెస్ట్‌

Matka Don Asadullah Arrest in Kurnool - Sakshi

రూ.10 లక్షల నగదు స్వాధీనం  

తనయుడికి ‘అధికార’ అండ  

టీడీపీ ‘పెద్ద’ రాయబారంతో మట్కా కేసు నుంచి విముక్తి  

కర్నూలు: శాంతి భద్రతలనే శాసిస్తున్న అక్రమార్కుల ఆట కట్టించే క్రమంలో మట్కా, గుట్కా మాఫియాలపై ఉక్కుపాదం మోపే దిశగా జిల్లా పోలీసు బాస్‌ పావులు కదుపుతున్నారు. అందులోభాగంగానే పక్కా ఆధారాలతో కర్నూలు నగరం బుధవారపేటలో మట్కా డాన్‌ అసదుల్లాతో కలిపి 9 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇదే ఇప్పుడు పోలీసు శాఖలో ప్రకంపనలకు కేంద్ర బిందువు అయ్యింది. అసదుల్లాపై ఇప్పటివరకు సుమారు 30కి పైగా మట్కా కేసులు నమోదయ్యాయి. ఎస్పీ రఘురామిరెడ్డి హయాంలో జిల్లా నుంచి బహిష్కరించడంతో కొంతకాలం గుంతకల్లు, మరికొంతకాలం హైదరాబాదుకు మకాం మార్చాడు.

ఆయన బదిలీపై వెళ్లగానే కర్నూలు చేరుకుని మట్కా సామ్రాజ్యాన్ని విస్తరించాడు. వారం క్రితం క్రైం పార్టీ పోలీసులు అసదుల్లా ఇంటిపై దాడి చేసి 8 మంది నిర్వాహకులను అదుపులోకి తీసుకుని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో ఉంచి వాస్తవాలను రాబట్టారు. అయితే అసదుల్లా కుటుంబానికి అధికార పార్టీ ‘పెద్ద’ అండ ఉండటం, ఆయన కుమారుడు అబ్బాస్‌ టీడీపీ నగర కార్యదర్శిగా కొనసాగుతుండటంతో పోలీసు అధికారులతో రాయబారం చేసి మట్కా కేసు నుంచి విముక్తి కల్పించినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఓ మంత్రి ద్వారా సిఫారసు చేయించి కేసు నీరుగార్చే ప్రయత్నం చేసినప్పటికీ ఉన్నతాధికారి ససేమిరా అనడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అసదుల్లాను అరెస్టు చూపారు. తన కుమారుడిని అరెస్టు చేసే అవకాశం ఏర్పడితే ఇంతకాలం సహకరించిన పోలీసు అధికారుల పేర్లు బయట పెట్టాల్సి వస్తుందని మట్కా నిర్వహణలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఒకరు బెదిరింపులకు దిగినట్లు చర్చ నడుస్తోంది. అసదుల్లా ఇంటిపై పోలీసులు దాడి జరిపిన రోజు నుంచి అబ్బాస్‌ అజ్ఞాతంలో ఉండి నగరంలోని ‘నక్షత్రాల’ హోటల్‌లో ఉంటూ అధికార పార్టీ నేత అండతో కేసు నుంచి బయట పడినట్లు చర్చ జరుగుతోంది.  

మట్కా మామూళ్ల గుట్టు రట్టు..
కర్నూలులో మట్కా ప్రధాన నిర్వాహకుడు అసదుల్లాతో పాటు కిందిస్థాయి వారు 8 మంది క్రైం పార్టీ పోలీసులకు దొరకడంతో విచారణలో అనేక నిజాలు బయటపడ్డాయి. మట్కాలో పోలీసు శాఖకు చెందిన కొందరి పాత్రపై పక్కాగా ఆధారాలు వెలుగు చూశాయన్నది విశ్వసనీయ వర్గాల వాదన. పోలీసులు కొందరు సహకరించిన తీరును మట్కా నిర్వాహకులు విచారణలో వివరించినట్లు తెలుస్తోంది. మామూళ్ల చిట్టాను కూడా విప్పినట్లు సమాచారం. బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమ అయిన వివరాల నుంచి ఎవరెవరికి ఎంత ముట్టజెప్పారన్న రిజిస్టర్‌ జాబితా వరకు అనేక రకాల సమాచారం ఇచ్చినట్లు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. అలాగే దాడుల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడినా అందులో సగం మాత్రమే రికార్డెడ్‌గా చూపించినట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.  

గంజాయి కేసు నమోదు..
మట్కా నిర్వహిస్తూ అక్కడికి వచ్చిన వారికి పొట్లాల రూపంలో గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో బయట పడటంతో అసదుల్లాతో కలిపి తొమ్మిది మందిపై మట్కాతో పాటు గంజాయి కేసు నమోదు చేసినట్లు కర్నూలు డీఎస్పీ యుగంధర్‌ బాబు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకుని కటకటాలకు పంపినట్లు తెలిపారు. గురువారం సాయంత్రం మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన వివరాలు వెల్లడించారు. కర్నూలు నగరం బుధవారపేటకు చెందిన టి.లక్ష్మినారాయణ, ప్రదీప్, బి.మధు, ప్రకాష్‌నగర్‌కు చెందిన షేక్‌షావలి, కొత్తపేటకు చెందిన ఎం.డి.వలి బాషా, బళ్లారి పట్టణానికి చెందిన సి.శ్రీనివాసులు, గుత్తి కోటా వీధికి చెందిన ఎస్‌.బాషా, మద్దికెర పట్టణం రామాలయం వీధికి చెందిన ప్రభాకర్‌ తదితరులతో కలసి అసదుల్లా బుధవారపేటలోని జంగాల కుళ్లాయప్ప ఇంట్లో మట్కా నిర్వహిస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 14 సెల్‌ఫోన్లు, 11.5 కేజీల గంజాయి, ప్రింటర్, 12 కాలిక్యులేటర్లు, రెండు 4జి హాట్‌స్పాట్స్‌తో పాటు మట్కా చీటీలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. సీఐలు హనుమంతు నాయక్, దివాకర్‌రెడ్డి, ఎస్‌ఐ తిరుపాలు తదితరులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top