అర్థరాత్రి హాస్టల్లో హాహాకారాలు

Massive Fire Accident in Safe Hands Ladies Hostel - Sakshi

సేఫ్‌ హ్యాండ్స్‌ లేడీస్‌ హాస్టల్‌లో షార్ట్‌ సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం

కాలి బూడిదైన సర్టిఫికెట్లు, ఫోన్లు, నగదు, దుస్తులు

విశాఖ క్రైం: ఆశీలుమెట్టలోని మేఘాలయ హోటల్‌ ఎదురుగా గల సేవ్‌హాండ్స్‌ లేడీస్‌ హాస్టల్‌లో శుక్రవారం అర్థరాత్రి షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే విద్యార్థినుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ఫోన్లు, నగదు, దుస్తులు కాలి బూడిదయ్యాయి. పోలీసులు, విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విజయవాడ, హైదరాబాద్‌తో పాటు వెస్ట్‌ బెంగాల్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 37 మంది విద్యార్థినులు అశీలుమెట్ట సమీపంలోని సేఫ్‌ హ్యాండ్స్‌ లేడీస్‌ హాస్టల్‌లో ఉంటున్నారు. వీరంతా శుక్రవారం రాత్రి భోజనం చేసి నిద్రపోయారు. అర్థరాత్రి సమయంలో రూం నెంబర్‌ – 2లో షార్ట్‌ సర్క్యూట్‌ కావడంతో టేబుల్‌ ఫ్యాన్‌ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. అవి సమీపంలోని మంచానికి, టీవీకి అంటుకోవడంతో కాలిపోయాయి.

దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన విద్యార్థినులు భయాందోళనతో పరుగులు తీసి తోటి వారికి విషయం తెలియజేశారు. వెంటనే అందరూ బయటకు పరుగులు తీశారు. ఈ హడావిడిలో కొందరు తమ సర్టిఫికెట్లు, ఇతర విలువైన వస్తువులు గదుల్లోనే వదిలేశారు. ప్రమాదం జరిగిన విషయాన్ని నిర్వాహకురాలు జయమ్మతోపాటు అగ్నిమాపక శాఖ సిబ్బందికి తెలియజేశారు. అయితే వారెవరూ వెంటనే స్పందించలేదని... సంఘటనా స్థలికి రాకుండానే జాగ్రత్తగా ఉండాలని చెప్పి నిర్వాహకురాలు జయమ్మ ఫోన్‌ పెట్టేసిందని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా సమయానికి రాకపోవడంతో విలువైన వస్తువులన్నీ కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లు, ల్యాప్‌టాప్‌లు, దుస్తులు కాలిబూడిదవడంతో వారంతా కన్నీరు పెట్టుకున్నారు. గదుల్లోని టీవీ, ఫ్యాన్లన్నీ పూర్తిగా కాలి బూడిదయ్యాయి. నీరు లేదని గంట సమయం ఆలస్యంగా అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలు అదుపు చేశారు. సుమారు రూ.20 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. వారంతా క్షేమంగా ఉన్నారని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

నిర్వహణ లోపం వల్లేనా..?
సేఫ్‌ హాండ్స్‌ లేడీస్‌ హాస్టల్‌ను అగ్గిపెట్టెల్లాంటి 15 చిన్న గదుల్లో 37 మంది విద్యార్థినులతో నిర్వహిస్తున్నారు. ఒక్కో గదిలో ఒక బెడ్, చిన్న బీరువా ఉండడంతో చాలా ఇరుకుగా ఉంటుంది. మరోవైపు హాస్టల్‌లో సరైన సౌకర్యాలు లేవని, అయినప్పటికీ నిర్వాహకురాలు పట్టించుకోవడంలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. చాలా గదుల్లో ఎక్కువ మంది ఉన్నారని, తగ్గించమని చెప్పినా వినిపించుకోలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి నెలకు రూ.5వేలు చొప్పున వసూలు చేస్తున్నా ఆ స్థాయిలో సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రమాదం జరిగిందని చెప్పినా నిర్వాహకురాలు కనీసం స్పందించలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని నిర్వాహకురాలు జయ మ్మ వద్ద విలేకరులు ప్రస్తావించగా హాస్టల్‌లో ఆగ్ని ప్రమాదం జరిగిందని తెలుసుకుని సంఘటన స్థలా నికి చేరుకున్నానని... భగవంతుని దయ వల్ల ఎవరికీ ఏమీ కాలేదని అన్నారు. అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేపడతామని ఈస్టు డివిజన్‌ ఏసీపీ అన్నెపు నర్శింహమూర్తి తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top