దోపిడీ దొంగల హల్‌చల్‌

Mask Thiefs Robbery Near Punjagutta Police Station - Sakshi

అర్ధరాత్రి పూట ఇంట్లోకి చొరబాటు

మహిళలకు బెదిరింపులు

డబ్బు, బంగారంపై ఆరా ఒకరిపై సుత్తితో దాడి

రూ.1,500 తీసుకుని పరారీ నిందితుల కోసం పోలీసుల గాలింపు

పంజగుట్ట: దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ఇంట్లోకి చొరబడి మహిళలను భయభ్రాంతులకు గురిచేశారు. తిరగబడిన మహిళను సుత్తితో బాదడంతో తీవ్ర గాయాల పాలైన ఘటన సోమవారం అర్ధరాత్రి పంజగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. అమీర్‌పేటలోని అపరాజితా కాలనీలో పద్మా రఘురాజ్, ఆమె కూతురు నందితా కపూర్, ఆమె కూతురు కీర్తి నివసిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి 2:20 గంటల సమయంలో ముగ్గురు ముసుగు దొంగలు ఇంటి ఆవరణలోకి ప్రవేశించారు. సుమారు 2:50 ప్రాంతంలో ఇంటి కిచెన్‌ ప్రాంతంలోని మరో తలుపు నుంచి దోమలు రాకుండా వేసిన నెట్‌ను తొలగించి తలుపు లోపలి గడియతీసి ఇంట్లోకి ప్రవేశించారు. చప్పుడు రావడంతో నందితా కపూర్, పద్మా, కీర్తి నిద్ర లేచి బయటకు వచ్చారు.

ఎవరు మీరు అంటూ అడ్డుకునేందు కు ప్రయత్నించగా డబ్బు, బంగారం ఎక్కడుందో చెప్పాలంటూ బెదిరించారు. దీంతో నందితా కపూర్‌ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. దొంగలు తమ వెంట తీసుకువచ్చిన సుత్తితో ఆమె తలపై బలంగా కొట్టారు. దీంతో నందితా కపూర్‌ తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అనంతరం పద్మా, కీర్తిలను డబ్బు ఎక్కడుందో చెప్పాలని బెదిరించారు. తమ వద్ద డబ్బులు, బంగారం లేదని వారు చెప్పారు. దీంతో వీరిని పక్కనే ఉన్న బాత్రూంలో ఉంచి బయటనుంచి గడియ పెట్టారు. అన్ని బెడ్రూంల్లోని సామాన్లను చిందరవందర చేశారు. డబ్బు, నగలకోసం ఎంత వెతికినా కనిపించకపోవడంతో టేబుల్‌పై ఉన్న రూ.1,500 తీసుకుని సుమారు 3:30 గంటలకు పరారయ్యారు. దొంగలు వెళ్లిపోయిన అనంతరం బాధితులు నందితా కపూర్‌ను అమీర్‌పేటలోని ఓ ఆస్పత్రికి తీసుకువెల్లి చికిత్స చేయించారు. తెల్లవారుజామున 4:17 గంటల ప్రాంతంలో 100కు ఫోన్‌ చేయడంతో పంజగుట్ట పోలీసులు ఘటన స్థలానికి వచ్చారు.   

తెలిసినవారి పనేనా?  
నిందితులు హిందీ మాట్లాడుతున్నారని, వారు నార్త్‌ ఇండియన్లుగా భావిస్తున్నామని బాధిత మహిళలు చెబుతున్నారు. ఇంట్లో కేవలం ముగ్గురు మహిళలు ఉంటున్నారని వీరు ముందే తెలుసుకున్నారా? లేదా గతంలో వీరింట్లో పనిచేసిన వారు ఎవరైనా చేసి ఉండవచ్చా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఘటనా స్థలాన్ని టాస్క్‌ఫోర్స్, సీసీఎస్, డాగ్‌స్వాడ్, ఫింగర్‌ప్రింట్స్‌ టీంలు పరిశీలించాయి. ఘటన జరిగిన ప్రాంతాన్ని పశ్చిమ మండల డీసీపీ ఎ.ఆర్‌.శ్రీనివాస్, అడిషనల్‌ డీసీపీ ఇగ్బాల్‌ సిద్ధిఖీ, ఏసీపీ తిరుపతన్నలు పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top