మంత్రి కాన్వాయ్‌పై బాధిత కుటుంబాల దాడి

Manchal Road Accident Relatives Protest - Sakshi

సాక్షి, రంగారెడ్డి : జిల్లాలోని మంచాల మండలం లింగంపల్లి వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 5 గురు మృతి చెందిన సంగతి తెలిసిందే. మద్యం మత్తులో యువకులు కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై ఆగ్రహాం వ్యక్తం చేసిన బాధితుల బంధువులు మృతదేహాలతో మంచాల రహదారిపై ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. భాదిత కుటుంబాలను పరామర్శించేందుకు ఘటనాస్థలానికి వచ్చిన మంత్రి మహేందర్‌ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి కాన్వాయ్‌పై ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. మృతులు కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో మంత్రి బాధిత కుటుంబాలతో చర్చలు జరుపుతున్నారు. ఇది చిత్రీకరిస్తున్న మీడియాపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు.

కాగా, చెన్నారెడ్డిగూడెంకు చెందిన పదిమంది మహిళలు ప్రతిరోజు కూరగాయలను ఆటోలో వేసుకొని హైదరాబాద్‌ నగరానికి తీసుకువస్తారు. రోజు వారి మాదిరిగానే సోమవారం కూడా దాదాపు పది మంది మహిళలు అదే గ్రామానికి చెందిన శీను ఆటోలో కూరగాయలు వేసుకొని నగరానికి బయలుదేరారు. మంచాల మండలం లింగంపల్లి వద్దకు రాగానే ఎదురుగా వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్‌తో పాటు ముందు భాగంలో కూర్చున్న మహిళలు అక్కడిక్కడే తుది శ్వాస విడిచారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను ఆటో డ్రైవర్‌ శీను, సుజాత, మాధవి, మారు, అఫిలీగా గుర్తించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top