ప్రేమపెళ్లి..ఇద్దరు ఒకే కులం అయినా? | Love Marriage Parents Attack Case Karimnagar | Sakshi
Sakshi News home page

ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కారణమా?

Oct 2 2018 7:41 AM | Updated on Oct 2 2018 4:28 PM

Love Marriage Parents Attack Case Karimnagar - Sakshi

తీవ్రంగా గాయపడిన మహేశ్‌

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రేమపెళ్లి చేసుకున్న ఓ యువకుడిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో సోమవారం చోటు చేసుకుంది. తీవ్రగాయాలకు గురైన యువకుడిని ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మండలంలోని దుమాల గ్రామానికి చెందిన దుంపలపల్లి మహేశ్‌(23) అదే గ్రామానికి చెందిన సోమారపు రేఖ(21) ప్రేమించుకున్నారు. ఇద్దరు ఒకే కులానికి చెందిన వారు అయినప్పటికీ రేఖ మహేష్‌కు వరుసకు చెల్లెలు కావడం వల్ల వారి పెళ్లిని అమ్మాయి కుటుంబసభ్యులు నిరాకరించారు. దీంతో గతేడాది నవంబర్‌ 21న హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. అక్కడే ఉంటున్నారు.

అయితే ఇరువురూ ఇంటికి రాకుంటే మహేశ్‌ తల్లిని చంపివేస్తామని రేఖ కుటుంబ సభ్యులు బెరించారు. దీంతో ఇరువురూ స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలోనే నెల తిరగకుండానే ఇరువురి మధ్య విభేదాలు చోటు చేసుకున్నారు. గతేడాది డిసెంబర్‌ 9న పోలీస్‌స్టేషన్‌లో రెండువర్గాల వారు పంచాయితీ చేసుకున్నారు. మహేశ్‌ ఇకపై రేఖను కలువరాదని షరతులు పెట్టి పుట్టింటికి  తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఆదివారం కానిస్టేబుల్‌ పరీక్ష రాయడానికి రేఖ కరీంనగర్‌ వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న మహేశ్‌ ఆమెను వెంబడించి కొదురుపాక వద్ద కలిసి తనతో ఉండాలని ఒత్తిడి చేశాడు. యువతి ఇంటికి వెళ్లి మహేశ్‌  వెంటపడి వేధించాడని కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో కోపోదిక్తులైన వారు మహేష్‌ ఇంటికి వెళ్లి దాడిచేసి తీవ్రంగా కొట్టారు. అడ్డుగా వెళ్లిన తల్లి బాలమణిని సైతం చితకబాదారు. పోలీసులు రంగంలోకి దిగి మహేశ్‌తో పాటు అతని తల్లిని చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్‌ తెలిపారు.

పెళ్లి ఇష్టం లేకనే దాడి 
నా కొడుకు రేఖను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే కర్రలు, రాడ్‌తో దాడి చేశారు. కులాలు ఒక్కటైనా ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు నా కొడుకు చావుబ్రతుకుల మధ్య ఉన్నాడు. అమ్మాయి కుటుంబసభ్యులు షరవింద్, బాను, బాల్‌రాజు, చందు, వజ్రవ్వ ఆమె భర్త కలిసి కొట్టారు. వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలి.  – బాలమణి, మహేశ్‌ తల్లి

Advertisement
 
Advertisement
Advertisement