ఆగస్టు 30 లోపు జైలుకు రావాల్సిందే!

Lalu Yadav Ordered Back To Jail By August 30 - Sakshi

పట్నా: బిహార్‌ రాజకీయ నేత, ఆర్‌జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తన పెరోల్‌ను పొడిగించాలని పెట్టుకున్న అభ్యర్థనను జార్ఖండ్‌ హైకోర్టు తిరస్కరించింది. అలాగే ఆగస్టు 30వ తేదీ లోపు జైలుకు రావాలని ఆదేశించింది. దాణా కుంభకోణంలో అప్పటి బిహార్‌ సీఎంగా ఉన్న లాలూ నిందితుడిగా తేలడంతో ఆయనకు రాంచీలోని సీబీఐ కోర్టు జైలుశిక్ష విధించింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలో అనారోగ్యానికి గురవడంతో కోర్టు మే 11న పెరోల్‌ మంజూరు చేసింది. ప్రస్తుతం ముంబాయిలోని ఓ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు.

అనారోగ్య కారణాల రీత్యా అప్పటి నుంచి పెరోల్‌ను పొడిగిస్తూ వచ్చారు. ఆరోగ్యం మెరుగు పడలేదని పెరోల్‌ను మరింత పొడిగించాలని లాలూ తరపు న్యాయవాది కోరగా న్యాయమూర్తి తిరస్కరించారు. ఎప్పుడు అవసరమైతే అప్పుడు లాలూకు చికిత్స అందించాలని  రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు తొలిసారి మే 11న ఆరువారాల పాటు ప్రొవిజినల్‌ బెయిల్‌ను మంజూరు చేశారు. అప్పటి నుంచి ఆయన బయటనే ఉన్నారు.  అవసరమైతే రాంచీలో రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం అందించాలని తెలిపింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top