లలితా జ్యుయెలరీ దోపిడీ కేసు; అప్‌డేట్‌

Lalitha Jewellery Robbery case: Gold valuables Recovered From Thief - Sakshi

సాక్షి, బనశంకరి (బెంగళూరు): తమిళనాడులో సంచలనం సృష్టించిన తిరుచ్చి లలితా జ్యుయెలరీ దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు అంతరాష్ట్ర దోపిడీదారుడిని బెంగళూరు బొమ్మనహళ్లి పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.5 కోట్ల విలువ చేసే 12 కేజీల బంగారు, ప్లాటినం నగలు, వజ్రాభరణాలతో పాటు టవేరా కారును స్వాధీనం చేసుకున్నామని నగర పోలీస్‌ కమిషనర్‌ భాస్కర్‌రావ్‌ మంగళవారం తెలిపారు. ఈ సొత్తును హోంమంత్రి బసవరాజ బొమ్మైతో కలిసి పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమిళనాడు తిరుచనాపల్లి తిరువంబూర్‌కు చెందిన మురుగన్‌(45) అలియాస్‌ బాలమురుగన్, శివకుమార్, శివ తదితర పేర్లతో తిరుగుతూ.. వివిధ రాష్ట్రాల్లో తన అనుచరులతో కలిసి భారీ దోపిడీలకు పాల్పడేవాడు.

తిరుచ్చి లలితా జ్యుయెలరీ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ శాఖలో దోచుకున్న బంగారు ఆభరణాలను తిరుచ్చి నది పక్కన అడవిలో గుంత తవ్వి పూడ్చిపెట్టాడు. ఇటీవల బొమ్మనహళ్లిలో చోటుచేసుకున్న చోరీ కేసులో తీవ్రంగా గాలించిన పోలీసులు మంగళవారం మురుగన్‌ను అరెస్టు చేసి తమదైన శైలిలో విచారించగా దొంగతనాల చిట్టా విప్పాడు. అతడిపై బెంగళూరులో బాణసవాడి, మడివాళ, హెచ్‌ఎస్‌ఆర్‌ లేఔట్, అమృతహళ్లి, నెలమంగల, అనేకల్‌లో చోరీ కేసులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అనేక బ్యాంకుల్లో అతడు చోరీలకు పాల్పడినట్లు తెలిసింది. కాగా మురుగన్‌ను నాలుగు రోజుల కిందటే బెంగళూరు పోలీసులు అరెస్టు చేసి బంగారు సొత్తును రికవరీ చేసినట్లు తెలిసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top