కిడ్నాప్‌ కథ సుఖాంతం   

 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

బాలుడు సురక్షితం..

తల్లిదండ్రులకు అప్పగింత

మొయినాబాద్‌(చేవెళ్ల) : మొయినాబాద్‌ పోలీసులు 24 గంటల్లో కిడ్నాప్‌ కేసును ఛేదించారు. బాలుడిని కిడ్నాప్‌ చేసిన మేనత్త భర్తను పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. అనంతరం బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. సోమవారం మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక్, మొయినాబాద్‌ సీఐ వెంకటేశ్వర్లు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం దేవనూర్‌ గ్రామానికి చెందిన బస్వరాజ్, అనిత దంపతుల కొడుకు హర్ష(20నెలలు)ను బస్వరాజ్‌ బావ కృష్ణయ్య మొయినాబాద్‌ మండలంలోని అజీజ్‌నగర్‌ రెవెన్యూ పరిధిలో ఉన్న హైదరాబాద్‌ పోలో రైడింగ్‌ క్లబ్‌లో నుంచి శనివారం రాత్రి కిడ్నాప్‌ చేసిన విషయం విధితమే. బాలుడి తండ్రి బస్వరాజ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం ఉదయం నుంచి మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.  

భార్య కోసమే కిడ్నాప్‌ డ్రామా... 

బాలుడి తండ్రి బస్వరాజ్‌ చెల్లెలు భాగ్యలక్ష్మిని కృష్ణయ్యకు ఇచ్చి వివాహం చేశారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి గత ఆరు నెలల క్రితం విడిపోయారు. పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి విడాకుల పత్రం రాసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. అయితే ఎలాగైనా తన భార్యను తన వద్దకు తెచ్చుకోవాలని భావించిన కృష్ణయ్య కిడ్నాప్‌ డ్రామా ఆడాడు. పథకం ప్రకారం పది రోజుల క్రితం బావమరిది బస్వరాజ్‌ పనిచేస్తున్న అజీజ్‌నగర్‌లోని హైదరాబాద్‌ పోలో రైడింగ్‌ క్లబ్‌కు వచ్చాడు.

మీతోనే ఉండి ఇక్కడే పనిచేసుకుంటానని నమ్మించాడు. పదిరోజుల్లో బాలుడిని చనువు చేసుకుని రోజూ బైక్‌పై తిప్పడం, బిస్కెట్లు కొనివ్వడం చేసేవాడు. శనివారం సైతం అదే విధంగా బైక్‌పై తీసుకెళ్లి తిరిగి రాలేదు. రాత్రయినా రాకపోవడంతో కృష్ణయ్యకు బస్వరాజ్‌ ఫోన్‌ చేశాడు. మీ కొడుకును నేను తీసుకెళ్తున్న.. నా భార్యను పంపిస్తేనే నీ కొడుకును ఇస్తా.. లేదంటే చంపేస్తానని చెప్పాడు.

ఎక్కడికి తీసుకురావాలని అడిగితే తాండూర్‌కు తీసుకురావాలని చెప్పాడు. అదే రోజు రాత్రి తాండూరుకు వెళ్లగా అతడు దొరకలేదు. ఫోన్‌ చేస్తే ఎత్తకపోవడంతో మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మూడు ప్రత్యేక బృందాలతో గాలించి పట్టుకున్నారు. 

సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా గుర్తింపు  

కృష్ణయ్య సెల్‌ఫోన్‌ ఆన్‌లో ఉండటంతో టవర్‌ లొకేషన్‌ ఆధారంగా అతడిని పట్టుకునేందుకు పోలీసులు వెంబడించారు. శనివారం రాత్రి బాలుడిని కిడ్నాప్‌ చేసిన కృష్ణయ్య బస్సులో శ్రీశైలం వెళ్లాడు. ఆదివారం ఉదయం అతని సెల్‌ టవర్‌ లొకేషన్‌ శ్రీశైలంలో ఉన్నట్లు తెలుసుకున్న పోలీసుల బృందం శ్రీశైలంకు బయలుదేరి వెళ్లింది. అయితే అతడు ఆదివారం రాత్రి శ్రీశైలం నుంచి తిరిగి హైదరాబాద్‌కు వచ్చాడు.

సెల్‌ టవర్‌ లోకేషన్‌ ఆధారంగా పోలీసులు అతన్ని వెంబడిస్తూ వచ్చారు. హైదరాబాద్‌ నుంచి గండిపేట మండలం కాళీమందిర్‌ వద్దకు రాగానే పోలీసులు కృష్ణయ్యను పట్టుకుని అతని వద్ద నుంచి బాలుడిని సురక్షితంగా కాపాడారు. నిందితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

కేసును ఛేదించడంలో శ్రమించిన మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఎస్సైలు వెంకట్, మహేంద్రనాథ్, హెడ్‌కానిస్టేబుల్‌ షరీఫ్, కానిస్టేబుళ్లు యాదగిరి, ఖలీల్, గోపాల్‌లను ఏసీపీ అశోక్‌ అభినందించారు. బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top