అత్తింటి వేధింపులకు కోడలి బలి

Kerala Woman Allegedly Starved To Death Over Dowry - Sakshi

సాక్షి, కొల్లాం: కేరళలోని కరునాగప్పపల్లిలో హృదయవిదారకరమైన సంఘటన చోటుచేసుకుంది. అత్తింటి వారి వేధింపులకు ఓ కోడలు బలైంది. అడిగినంత కట్నం తీసుకురాలేదనే కోపంతో ఓ మహిళకు అన్నం పెట్టకుండా ఒక సంవత్సరం పాటు వేధించడంతో ఆమె చనిపోయిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆమె చనిపోయినపుడు 20 కేజీల బరువు మాత్రమే ఉండటం గమనిస్తే ఆమెను భర్త, అత్త ఎంత వేధించి ఉంటారో అర్ధం చేసుకోవచ్చు. ఆమె కొన్నిరోజులుగా నానబెట్టిన బియ్యం, నీళ్లల్లో చక్కెర వేసుకుని ఆహారంగా తీసుకుంటూ బతికిందని, మొదట చూసినపుడు మృతురాలు ఒక ఎముకల గూడులా కనిపించిందని పోలీసులు వెల్లడించారు.

వేధింపులకు గురిచేసిన భర్త, అత్తను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ప్రభుత్వం పోలీసు అధికారులను ఆదేశించింది. అదనపు కట్నం కోసం వేధించేవారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఐదేళ్లుగా తన కూతురిని కట్నం కోసం అల్లుడు వేధించాడని, ఏడాది నుంచి తన కూతుర్ని కూడా కలవనీయలేదని మృతురాలి తల్లి  ఆవేదన వ్యక్తం చేసింది. తన
కూతురికేమైనా హాని తలపెడతాడేమోనని భయం వేసి పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నారు. మృతురాలి భర్త చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుండేవాడని, వీరికి 2013లో పెళ్లి జరిగిందని, అలాగే వీరికి ఇద్దరు పిల్లలున్నారని పోలీసులు తెలిపారు. పెళ్లి సమయంలో కొంత బంగారం, డబ్బులను కట్నంగా కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. అదనపు కట్నం కోసమే ఈ విధంగా వేధించి, ఆకలితో అలమటించి చనిపోయేలా చేశారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top