‘మైనర్‌ మృగాడి’కి జీవిత ఖైదు

Juvenile who sodomised, murdered boy, gets lifer - Sakshi

దేశంలోనే తొలిసారిగా ‘పోక్సో’ చట్టంకింద అరుదైన తీర్పు

పదేళ్ళ పిల్లాడిపై అసహజ లైంగికదాడి, దారుణ హత్య

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ హాకా భవన్‌లోని చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు గురువారం దేశంలోనే అత్యంత అరుదైన, సంచలనాత్మకమైన తీర్పు నిచ్చింది. చిన్నారులపై లైంగిక దాడులు నిరోధించడానికి అమలులోకి వచ్చిన పోక్సో యాక్ట్‌ కింద ఓ చిన్నారిపై అత్యాచారం జరిగిన కేసులో, నేరం చేసిన మరో బాలుడికి జీవితఖైదు విధించింది. ఈ తరహా కేసులో ఇలాంటి తీర్పు రావడం దేశంలోనే ఇది తొలిసారి అని నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారికి రూ.20 వేల రివార్డు ప్రకటించారు.

సంచలనం సృష్టించిన కేసు
పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట పరిధిలో పదేళ్ల బాలుడిని కిడ్నాప్‌ చేసి, అసహజ లైంగిక దాడికి పాల్పడి, దారుణంగా హత్య చేసిన కేసులో నేరం చేసిన బాలుడిని దోషిగా నిర్ధారించిన చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టు గురువారం అతడికి కఠిన శిక్ష విధించింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌లోని ఐదు సెక్షన్ల కింద రెండు జీవిత ఖైదులు, రెండు పదేళ్ల కఠిన కారాగార శిక్షలు, మరో ఏడేళ్ల శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు మెట్రో పాలిటన్‌ సెషన్స్‌ జడ్జి కుంచాల సునీత సంచలనాత్మక తీర్పు వెలువరించారు.

ఈ శిక్షలన్నీ ఏకకాలంలో (కాంకరెంట్లీ) అమలవుతాయని పేర్కొన్నారు. 2017 జూలైలో వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం రెండేళ్లలోపే తీర్పు వెలువరించడం విశేషం. బార్కాస్‌ ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌ కుమారుడు (10) అదే ప్రాంతంలోని ఓ పాఠశాలలో నాలుగో తరగతి చదివేవాడు. 2017 జూన్‌ 26న బార్కాస్‌ బజార్‌ ప్రాంతంలో మేళా వద్ద ఆడుకుంటూ అదృశ్యమయ్యాడు. అతడి కోసం గాలించిన కుటుంబసభ్యులు బాలుడి ఆచూకీ తెలియకపోవడంతో మరుసటి రోజు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. బడీ మసీదు వద్ద ఆడుకుంటున్న చిన్నారికి బిస్కెట్లు, చాక్లెట్లు ఆశ చూపిన మరో బాలుడు అతడిని బార్కాస్‌ ప్రభుత్వ పాఠశాల వద్దకు తీసుకువెళ్లాడు. సాయంత్రం పాఠశాల గ్రిల్స్‌ తొలగించి భవనంపైకి తీసుకెళ్లి చిన్నారిపై అసహజ లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో భయాందోళనకు గురైన బాలుడు తనకు నొప్పిగా ఉందని, ఈ విషయం తన తండ్రికి చెప్తాననడంతో ఆ బాలుడు భయపడ్డాడు. ఘటన వెలుగులోకి రాకుండా ఉండేందుకు చిన్నారిని హత్య చేయాలని నిర్ణయించుకుని, అక్కడే ఉన్న రాడ్లు, కర్రలతో దాడి చేసి హతమార్చాడు.

అనంతరం మృతదేహాన్ని మాయం చేసే ఉద్దేశంతో అక్కడి నుంచి తరలించేందుకు కాళ్లు, చేతులు కట్టేశాడు. అందుకు వీలు పడకపోవడంతో అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఇలా మృతదేహాన్ని మరో చోటికి మార్చేందుకు రెండుసార్లు ప్రయత్నించినా లాభం లేకపోవడంతో మిన్నకుండిపోయాడు. ఈ ఉదంతం జరిగింది మూడో అంతస్తుపైన కావడం, పాడుబడిన ఆ ప్రాంతానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు వెళ్లకపోవడంతో ఈ విషయం వెలుగులోకి రాలేదు. బాలుడి మిస్సింగ్‌ కేసు దర్యాప్తు చేపట్టిన చాంద్రాయణగుట్ట పోలీసులు బార్కాస్, చాంద్రాయణగుట్ట పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే చిన్నారి అదృశ్యమైన రోజు మధ్యాహ్నం 1.28 గంటలకు ఓ యువకుడు చిన్నారిని తీసుకెళుతున్నట్లు కనిపించింది.

దీన్ని చూసిన బాలుడి తండ్రి ఆ మైనర్‌ తన ఇంటి పక్కనే ఉండే బాలుడిగా గుర్తించాడు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... తొలుత తనకేమీ తెలియదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్‌ చూపించడంతో నేరం అంగీకరించాడు. ఈ కేసులో చాంద్రాయణగుట్ట పోలీసులు హాకా భవన్‌లోని చైల్డ్‌ ఫ్రెండ్లీ కోర్టులో అభియోగాలు దాఖలు చేశారు. న్యాయస్థానం పోక్సో యాక్ట్‌లోని సెక్షన్‌ 6 కింద నేరం చేసిన బాలుడికి జీవితఖైదు, హత్యా నేరం కింద మరో జీవితఖైదు, కిడ్నాప్‌ నేరం కింద, అసహజ లైంగికదాడి కింద పదేళ్ళ చొప్పున, ఆధారాలు నాశనం చేయడానికి ప్రయత్నించడంతో ఏడేళ్ళ శిక్ష విధించింది. ఈ శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని స్పష్టం చేసింది.

ప్రవీణ్, శ్రీనివాసరెడ్డిలకు ఇంతకంటే కఠినశిక్షలు
బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో మైనర్లపై అత్యాచారం జరిపి, హత్య చేసి తన బావిలోనే పూడ్చిన సైకో శ్రీనివాసరెడ్డి, ఇటీవల వరంగల్‌లోని కుమార్‌పల్లిలో 9 నెలల చిన్నారిపై లైంగికదాడి చేసి పాశవికంగా హత్య చేసిన ప్రవీణ్‌లకు ఇంతకుమించిన శిక్షలు పడతాయని పలువురు పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top