తాళం వేసిన ఇళ్లలో చోరీలు

Interstate Thieves Arrested Warangal - Sakshi

కాజీపేట అర్బన్‌: ఈజీ మనీకి అలవాటు పడి, తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట దొంగలను అరెస్ట్‌ చేసి, వారి నుంచి భారీగా బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో శనివారం విలేకరుల సమావేశంలో సీపీ వివరాలను వెల్లడించారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం లోని ధార్‌ జిల్లా, కుక్షి తహశీల్‌ బగోలి గ్రామానికి చెందిన 25 ఏళ్ల దిలీప్‌ పవార్, అదే తహసీల్‌ భడ్‌కచ్‌ గ్రామానికి చెందిన 21 ఏళ్ల సర్వన్‌ పవార్‌ దూరపు బంధువులు. వీరు మధ్యలోనే చదువు మానేసి కూలిపని చేస్తుండేవారు. తర్వాత చెడు వ్యసనాలు, జల్సాలకు అలవాటు పడి ఈజీమనీ కోసం దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నారు.

తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యం..
రైలు మార్గంలో ఉన్న వరంగల్‌ నగరాన్ని ఎంచుకున్నారు. నగరానికి చేరుకుని తాళం వేసిన ఇళ్లను చూసి, రాత్రి వేళల్లో తాళాలను పగులగొట్టి చోరీలకు పాల్పడేవారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఏడాదిలో మామునూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడటంతోపాటు ఒక బైక్, సుబేదారి పరిధిలో రెండు ఇళ్లలో చోరీలు, రెండు బైక్‌లు, కేయూసీ పరిధిలో రెండు చోరీలు, మట్వాడా, హన్మకొండ, మిల్స్‌కాలనీ, కాజీపేట, కమలాపూర్, గీసుకొండ, ఐనవోలు, దేవరుప్పుల పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఒక్కో ఇంట్లో చోరీలకు పాల్పడ్డారు. సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు డేవిడ్‌రాజు, రవిరాజ్‌ నేతృత్వంలో రెండు ప్రత్యేక బలగాలను మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి పంపి విచారణ జరపగా వారిద్దరు వరంగల్‌లో చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇక్కడి సీసీ కెమెరాల్లో వారిద్దరినీ గుర్తించడంతోపాటు వారి కదలికలపై నిఘా ఏర్పాటు చేశారు.

వరంగల్‌కు వెళ్తుండగా...
చోరీ చేసిన బంగారం, వెండి ఆభరణాలను విక్రయించేందుకు చోరీ చేసిన బైక్‌పై వరంగల్‌కు హన్మకొండ నుంచి హంటర్‌రోడ్డు మీదుగా వెళ్తున్నారు. క్రైమ్స్‌ అదనపు డీసీసీ బిల్లా అశోక్‌కుమార్‌ సమాచారం మేరకు సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు డేవిడ్‌రాజు, రవిరాజు తనిఖీలు చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 900 గ్రాముల బంగారం, 12 కిలోల వెండి, మూడు బైక్, రెండు సెల్‌ఫోన్లు, చోరీకి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులను శనివారం రిమాండ్‌కు తరలించినట్లు సీపీ తెలిపారు. వారికి సహకరించిన ఇద్దరిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు డేవిడ్‌రాజు, రవిరాజ్‌ను అభినందించారు.  ఐటీకోర్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్, అసిస్టెంట్‌ అనాలిటికల్‌ ఆఫీసర్‌ సల్మాన్‌పాషా, ఏఎస్సైలు వీరాస్వామి, శివకుమార్, హెడ్‌కానిస్టేబుళ్లు అహ్మద్‌పాషా, జంపయ్య, కానిస్టేబుళ్లు రాజశేఖర్, చంద్రశేఖర్, మహేశ్వర్, డ్రిస్టిక్ట్‌ గార్డ్స్‌ కానిస్టేబుళ్లు సుధాకర్‌రెడ్డి, మహేష్, మహేందర్‌ పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top