
దొంగలను అరెస్టు చూపుతున్న డీసీపీ సంజీవ్‌కుమార్
కరీంనగర్‌క్రైం: వివిధ జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు అంతర్ జిల్లా దొంగలను జమ్మికుంట, కరీంనగర్ సీసీఎస్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. కరీంనగర్ కమిషనరేట్‌లోని హెడ్‌క్వార్టర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ సంజీవ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. జనగాం జిల్లా దేవరప్పుల మండలం పెద్ద మాడూరు గ్రామానికి చెందిన మాటూరి సంపత్‌గౌడ్(27), తాళ్ల కుమార్(35) నల్గొండ జిల్లా మోత్కూర్ గ్రామానికి చెందిన సిరిగిరి సాయి అలియాస్ సాయిబాబా(23) ఒక ముఠాగా ఏర్పడి కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో ఇళ్ల తాళాలు పగులకొట్టి చోరీలకు పాల్పడ్డారు.
తాజాగా ఫిబ్రవరి 23న జమ్మికుంట పోలీస్‌స్టేషన్ పరిధిలోని గండ్రపల్లి గ్రామంలో పల్లేని మల్హర్‌రావు ఇంట్లో చోరీకి పాల్పడి 70 వేల విలువ చేసే 47 గ్రాముల బంగారం అభరణాలు, 2600 చోరీ చేశారు. అ ముఠా సభ్యులను పట్టుకునేందుకు సీసీఎస్ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. జమ్మికుంటలోని మేదరివాడ, రైల్వేస్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా తిరుగుతున్న మాటూరి సంపత్‌గౌడ్(27), తాళ్ల కుమార్(35), సాయిబాబా(23) అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా పలు చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారు. వీరి వద్ద బంగారు, వెండి అభరణాలు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ ఏసీపీ శ్రీనివాస్, జమ్మికుంట, సీసీఎస్ సీఐలు ప్రశాంత్‌రెడ్డి, కిరణ్‌కుమార్, ఎస్సైలు శ్రీనివాస్, సాగర్, నాగరాజు పాల్గొన్నారు.