చికెన్‌లో మత్తు పదార్థాలు పెట్టి..

Indian Origin Brothers Arrested For Smuggle Drugs In Chicken In Birmingham - Sakshi

బర్మింగ్‌హమ్‌ : మిలియన్ డాలర్ల విలువైన మత్తు పదార్థాలను చికెన్‌లో పెట్టి సరాఫరా చేస్తున్న ఇద్దరు ప్రవాస భారతీయులను బర్మింగ్‌హమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. మంజిందర్ సింగ్ థాఖర్‌ , దేవిందర్ సింగ్ థాఖర్‌లు శుక్రవారం నెదర్లాండ్స్‌ నుంచి వచ్చిన చికెన్‌ షిప్‌మెంట్‌లో మత్తు పదార్థాలు తరలిస్తుండగా పోలీసులకు చిక్కారు. ఈ నేపథ్యంలో వారి వద్ద నుంచి 5 యూరో మిలియన్‌ డాలర్ల విలువ గల హెరాయిన్‌, కొకైన్‌లను స్వాధీనం చేసుకున్నారు.

నేషనల్‌ క్రైమ్‌ ఏజెన్సీ వివరాల ప్రకారం.. ఈ ముఠాకు వసీమ్‌ హుస్సేన్‌, నజరత్‌ హుస్సేన్‌లు నాయకత్వం వహిస్తున్నట్లు తెలిసింది. బర్మింగ్‌హమ్‌ క్రౌన్‌ కోర్టు 44 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో ప్రసుత్తం వీరిద్దరు జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. కాగా, వీరు జైలు నుంచే ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు తెలిసింది. జూన్‌ 2016 లో మొదలైన వీరి వ్యాపారం  తర్వాత కొన్ని గ్రూపులుగా విడిపోయి దందాను నిర్వహిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

కాగా, వీరు తమ దందాను కొనసాగించేందుకు పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకునేవారు. అందుకోసం నమ్మకస్తులైన షిప్పింగ్‌ కంపెనీస్‌తో ఒప్పందం కుదుర్చుకుంటారు. చికెన్‌ వ్యాపారం పేరుతో ఇన్నర్‌గా మత్తు పదార్థాలను సరఫరా చేసేవారు. ప్రధానంగా నెదర్లాండ్స్‌ లోని రోటర్‌డామ్‌ షిప్పింగ్‌ కేంద్రం నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్లే వాటిని ఎంపిక చేసుకొని అక్కడి నుంచి కావలసిన వారికి డ్రగ్స్‌ను సరఫరా చేసేవారు. అయితే ఈ షిప్‌మెంట్‌ ఏర్పాట్లను నజరత్‌ హుస్సేన్‌ ఓవైపు చూసుకుంటునే నెదర్లాండ్స్‌లో తనకు సహకరిస్తున్న వారిని గుట్టు చప్పుడు కాకుండా కలిసేవారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం చికెన్‌ షిప్‌మెంట్స్‌ను తరలిస్తున్న మంజిందర్‌, దేవిందర్‌లపై బర్మింగ్‌హమ్‌ ట్యాక్సీ డ్రైవర్‌ అద్నాన్‌ మాలిక్‌కు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసుల వీరిద్దరి కదలికలను గమనించి అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, థకార్‌ సోదరులకు జనవరి 20న శిక్షను విధించే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top