రైలులో ఉన్మాది వీరంగం

Home Guard Dead With Psycho Attack - Sakshi

ప్రయాణికులపై అసభ్య ప్రవర్తన

అడ్డుకున్న హోంగార్డు తోసివేత

హోంగార్డు దుర్మరణం

తుని: తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలో వేగంగా వెళ్తున్న రైలు నుంచి ఓ ఉన్మాది తోసివేయడంతో ఆదివారం హోంగార్డు దుర్మరణం పాలయ్యాడు. తుని జీఆర్పీ ఎస్‌ఐ అబ్దుల్‌ మారూఫ్‌ తెలిపిన వివరాలు.. అలెప్పీ నుంచి ధన్‌బాద్‌ వెళ్తున్న బొకారో ఎక్స్‌ప్రెస్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన అబీబ్‌ ప్రయాణిస్తున్నాడు. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌ దాటిన తర్వాత ఎస్‌–7 బోగీలో సహచర ప్రయాణికులను అతడు ఇబ్బందులకు గురి చేశాడు. సామర్లకోటలో అదే రైలు ఎక్కిన హోంగార్డు రెడ్డి సూర్యవెంకటశివ (35) ఎస్‌–7 బోగీలోకి వచ్చాడు. అబీబ్‌ అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని ప్రయాణికులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఎందుకిలా చేస్తున్నావంటూ అబీబ్‌ను నిలువరించేందుకు హోంగార్డు వెంకటశివ ప్రయత్నించాడు.

తుని స్టేషన్‌ సమీపంలోకి రైలు వచ్చిన సమయంలో అబీబ్‌ అనూహ్యంగా నెట్టివేయడంతో హోంగార్డు రైలు నుంచి కింద పడిపోయాడు. తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. బోగీలో ఉన్న ప్రయాణికులు తుని జీఆర్పీకి సమాచారం ఇచ్చారు. పోలీసులు అబీబ్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు. జిల్లాలోని కోటనందూరు మండలం కొత్తకొట్టాం గ్రామానికి చెందిన వెంకటశివ కోటనందూరు పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డుగా పని చేస్తున్నాడు. సామర్లకోటలో ట్రాఫిక్‌ విధులు నిర్వహించి, ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ విషాదం జరిగింది. శివకు ఏడాది క్రితమే వివాహమైంది. జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీంఅస్మి తుని చేరుకొని హోంగార్డు మృతదేహాన్ని పరిశీలించారు. కుటుంబసభ్యులను ఓదార్చి ఆర్థిక సాయం అందజేశారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top