కిరాతకుడికి మహిళా కోర్టు మరణశిక్ష | Sakshi
Sakshi News home page

హాసిని అత్యాచారం కేసులో దశ్వంత్‌ కు ఉరి

Published Tue, Feb 20 2018 2:49 AM

Hasini killer Dhasvant gets capital punishment - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: తన కన్న తల్లిని, ఆరేళ్ల చిన్నారిని అమానుషంగా హతమార్చిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దశ్వంత్‌ (24)కు తమిళనాడులోని మహిళా కోర్టు మరణదండన విధించింది. చిన్నారిపై అత్యాచారం చేసి సజీవంగా తగలబెట్టినట్లు, డబ్బు ఇవ్వలేదని తల్లినే హతమార్చినట్లు నేరం రుజువు కావడంతో చెంగల్పట్టు మహిళా కోర్టు నిందితునికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు సోమవారం తీర్పు వెల్లడించింది. చెన్నై శివారులోని కున్రత్తూరు సంబంధం నగర్‌కు చెందిన దశ్వంత్‌ తల్లిదండ్రులతో కలసి ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నాడు.

అదే అపార్ట్‌మెంట్‌లో బాబు అనే వ్యక్తి కూడా ఉంటున్నారు. బాబు కుమార్తె హాసిని (6)ని దశ్వంత్‌ గతేడాది ఫిబ్రవరి 5న ఇంటికి సమీపంలోని మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని సజీవదహనం చేశాడు. చిన్నారి తండ్రి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు గతేడాది ఫిబ్రవరి 7న దశ్వంత్‌ను అరెస్ట్‌ చేశారు. గతేడాది సెప్టెంబరు 13న అతడు బెయిల్‌పై బయటకు వచ్చాడు. జులాయి తిరుగుళ్లకు అలవాటుపడ్డ దశ్వంత్‌ డబ్బు కోసం తల్లితో గొడవపడేవాడు.

డబ్బులు ఇవ్వకపోవడంతో డిసెంబర్‌ 2న తల్లిని దారుణంగా హత్యచేసి ఆమె మెడలోని 25 తులాల బంగారు నగలు, బీరువాలోని రూ. 10 వేల నగదు తీసుకుని తమిళనాడు నుంచి పరారయ్యాడు. డిసెంబర్‌ 8న ముంబైలో తమిళనాడు పోలీసులకు పట్టుబడగా, నిందితుడిని చెంగల్పట్టు మహిళా కోర్టులో హాజరుపరిచి పుళల్‌ సెంట్రల్‌ జైలుకు పంపారు. ఈ నేపథ్యంలో దశ్వంత్‌ చేసిన నేరాలు సాక్ష్యాధారాలతో రుజువైనందున మరణశిక్ష విధిస్తున్నట్లు చెంగల్పట్టు మహిళా కోర్టు న్యాయమూర్తి వేల్‌మురుగన్‌ సోమవారం తీర్పు చెప్పారు.  

Advertisement
Advertisement