బస్సు చక్రాల కింద నలిగి బాలుడు మృతి

Four Years Old Kid Died In School Bus Accident - Sakshi

హయత్‌నగర్‌: స్కూలుకు వెళ్లి ఓ బాలుడు అదే స్కూలు బస్సు చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయాడు. ఇంటికి సమీపంలో జరిగిన ఈ దుర్ఘటన శుక్రవారం సాయంత్రం హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొహెడా గ్రామానికి చెందిన బండారి బీరప్ప, బార్గవిల పెద్దకొడుకు రిషితేజ్‌(4). బీరప్ప లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రిషితేజ్‌ను నెల క్రితమే స్థానికంగా ఉన్న సంకీర్త్‌ గ్రామర్‌ స్కూల్‌లో నర్సరీలో చేర్పించాడు.

ఉదయం పాఠశాలకు వెళ్లిన రిషితేజ్‌ సాయంత్రం ఇంటికి స్కూలు బస్సులో బయలుదేరాడు. కొహెడాలోని హనుమాన్‌ దేవాలయం సమీపంలో ఉన్న ఇంటి సమీపంలో బస్సు దిగాడు. గల్లీలో ఉన్న ఇంటికి చేరేందుకు బస్సు వెనుక నుంచి నడుచుకుంటూ వెళుతూ.. ఇంటి ర్యాంపు (జారుడు బండ) పైకి ఎక్కాడు. బస్సు ముందుకు కదులుతుండగా ర్యాంపు నుంచి జారిపడి పాఠశాల బస్సు వెనుక చక్రాల కింద పడిపోయాడు. బస్సు చక్రాలు బాలుడి తల పైనుంచి పోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఇరుకు సందులో దారిని ఆక్రమించి ఎత్తుగా నిర్మించిన ర్యాంపు బాలుడి మృతికి కారణమైందని స్థానికులు అంటున్నారు. ర్యాంపు పక్కన నుంచే బస్సు వెళ్లడంతో ర్యాంపుపైకి ఎక్కిన బాలుడు జారి బస్సు కింది పడినట్టు చెబుతున్నారు.

పాఠశాల ముందు ఆందోళన
బాలుడి మృతికి పాఠశాల బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని బాలుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బాలుడి మృతదేహాంతో సంకీర్త్‌ పాఠశాల వద్దకు ఆందోళనకు దిగారు. డ్రైవర్‌ నర్సింహ బస్సు దిగిన పిల్లలను పట్టించుకోకుండా బస్సు నడపడం వల్లనే దుర్ఘటన జరిగిందని దీనికి పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించి తగిన న్యాయం చేయాలని బాలల హక్కుల సంఘం నాయుడు అచ్చుతరావు డిమాండ్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top