ఉసురు తీసిన అప్పులు 

Farmer Committed Suicide - Sakshi

అప్పులు ఓ రైతు ఉసురు తీశాయి. వ్యవసాయంలో నష్టాలు అతడిని ఆర్థికంగా కుదేలు చేశాయి. పొట్టకూటి కోసం వలసబాట పట్టి బేల్దారి పనులు చేస్తున్నాడు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను చూసి ఆశలు చిగురించాయి. ఈసారి పంట సాగు చేస్తే దేవుడి దయ వల్ల చేతికందితే కష్టాల నుండి గట్టెక్కవచ్చనుకున్నాడు. అంతే స్వగ్రామానికి చేరుకుని సబ్సిడీ విత్తన వేరుశనగ కోసం వెళ్తే.. అప్పులిచ్చిన వారు సూటిపోటి మాటలతో మనసును గాయపరిచారు. జీవితంపై విరక్తి చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటన ఇది. 

సాక్షి, ఉరవకొండ/ ఉరవకొండ రూరల్‌ : అప్పుల బాధ భరించలేక బూదగవి గ్రామానికి చెందిన రైతు జి.వీరేష్‌ (35) ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళ్తే.. వీరేష్‌కు మూడు ఎకరాల పొలం ఉంది. గ్రామంలో మరో పది ఎకరాలు కౌలుకు తీసుకున్నాడు. వర్షాధారం కింద వేరుశనగ సాగు చేసేవాడు. వరుస కరువుల కారణంగా మూడేళ్లుగా పంట చేతికందలేదు. పెట్టుబడి కోసం చేసిన అప్పులు దాదాపు రూ.3లక్షలకు చేరుకున్నాయి. దీంతో కుటుంబ పోషణ కూడా భారంగా మారింది. విధిలేని పరిస్థితిలో ఉన్న ఊరు వదిలి ఆరునెలల క్రితం తిరుపతికి వెళ్లాడు. అక్కడ బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఖరీఫ్‌ సాగుకు సంబంధించి ప్రభుత్వం సబ్సిడీపై విత్తన వేరుశనగ పంపిణీ చేపడుతున్నట్లు సమాచారం తెలుసుకున్నాడు. వర్షాలు కూడా సమృద్ధిగానే కురుస్తుండటంతో మళ్లీ వ్యవసాయం వైపు ధ్యాస మళ్లింది.
 

మృతుడు వీరేష్‌

మాటలు తూటాల్లా గుచ్చుకుని.. 
ఖరీఫ్‌లో వేరుశనగ సాగుచేసేందుకని వీరేష్‌ సోమవారం బూదగవి గ్రామానికి వచ్చాడు. అప్పులు ఇచ్చిన వారు డబ్బు కోసం ఒత్తిడి చేశారు. తనకు కాస్త గడువు ఇవ్వాలని అతడు కోరాడు. అయినా కొందరు సూటిపోటి మాటలు అనడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఉదయం ఉరవకొండకు వచ్చి ఆటోస్టాండ్‌ వద్ద పురుగుమందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. ఆటో డ్రైవర్ల ుగమనించి వీరేష్‌ను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆస్పత్రికి పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతి చెందాడు. వీరేష్‌కు భార్య కవిత, పదేళ్ల కుమారుడు ఉన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top