కుటుంబం జలసమాధి

Family Died In Car Roll Overed In Canal Karnataka - Sakshi

మైసూరు జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన కారు  

తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లల మృతి  

మైసూరు: ఆ కుటుంబంపై విధికి కన్నుకుట్టింది. ఇద్దరు పిల్లలూ మానసిక వైకల్యంతో బాధపడుతున్నారు. వారికి వచ్చే భృతి తీసుకుందామని వెళ్తుంటే రోడ్డు ప్రమాదం కబళించింది. కారు అదుపుతప్పి హారంగి కాలువలో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటన సోమవారం జిల్లాలోని పిరియాపట్టణ తాలూకాలో చోటు చేసుకుంది. తాలూకాలోని దొడ్డకమరవళ్లి గ్రామానికి చెందిన పళనిరాజ్‌ (48) కొడగు జిల్లా నాపొక్లు గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ భార్య సంజుకుమారి (38), పిల్లలు పూర్ణిమ (18), లిఖిత్‌ (15) కలసి జీవిస్తుండేవారు.

పళనిరాజ్‌ ఇద్దరు పిల్లలు దివ్యాంగులు కావడంతో ప్రతీనెలా ప్రభుత్వం నుంచి లభించే భృతి కోసం సొంత గ్రామమైన దొడ్డకమరవళ్లి వస్తుండేవారు. ఈ నెల సహాయ ధనాన్ని తీసుకునేందుకు సోమవారం ఉదయం ఓమ్నీ కారులో గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో గ్రామ శివార్లకు చేరుకోగానే ఓమ్నీ కారు అదుపు తప్పడంతో పక్కనే ఉన్న హారంగి కాలువలోకి దూసుకెళ్లింది. ఘటనలో పళనిరాజ్‌తో పాటు భార్య పిల్లలు కూడా నీటిలో మునిగి మృతి చెందారు. గ్రామస్థులు అందించిన సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పిరియాపట్టణ పోలీసులు ఓమ్నీ వాహనాన్ని వెలికితీసి కేసు నమోదు చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top