కాపీ.. పేస్ట్‌.. చేసేయ్‌ చీట్‌! | Cyber Criminals Entry in Real Estate Industry | Sakshi
Sakshi News home page

కాపీ.. పేస్ట్‌.. చేసేయ్‌ చీట్‌!

May 16 2019 8:39 AM | Updated on May 16 2019 8:39 AM

Cyber Criminals Entry in Real Estate Industry - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఫేస్‌బుక్‌లో అందుబాటులోకి వచ్చిన మార్కెట్‌ప్లేస్‌ కేంద్రంగా కొత్త తరహా మోసాలు జరుగుతున్నాయి. అక్కడ ఉన్న ప్రకటనల్ని కాపీ చేసి, సొంతంగా పేస్ట్‌ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు ఆకర్షితులైన వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. ప్రధానంగా రియల్‌ఎస్టేట్‌ సంబంధిత వాటినే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ వ్యవహారంలో సైబర్‌ నేరగాళ్లు కొన్ని బోగస్‌ డాక్యుమెంట్లనూ సృష్టించి పంపిస్తుండటం కొసమెరుపు. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు పెరిగినట్లు చెబుతున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.  

ఒకప్పుడు సెకండ్‌హ్యాండ్‌ వస్తువులే...
వాట్సాప్, ట్విటర్, ఇన్‌స్ట్రాగామ్‌... ఇలా ప్రజాదరణ పొందిన ప్రతి సోషల్‌మీడియాను సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సెకండ్‌ హ్యాండ్‌తో పాటు కొన్ని రకాలైన ఫస్ట్‌హ్యాండ్‌ వస్తువులు అమ్మడానికి, కొనడానికి ఆన్‌లైన్‌పై ఆధారపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఖరీదు చేసే వారు సైతం వాటికి సంబంధించిన సమాచారం సేకరించడాని కి ఇంటర్‌నెట్‌పై ఆధారపడుతున్నారు. వీటికి తో డు ఫేస్‌బుక్‌లోనూ ప్రత్యేకంగా మార్కెట్‌ ప్లేస్‌ పేరుతో పేజ్‌లు పుట్టుకొచ్చాయి. ద్విచక్ర వాహనా లు, కార్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను తక్కువ ధరకు విక్రయిస్తున్నామంటూ మార్కెట్‌ ప్లేస్‌లో ప్రకటనలు ఇవ్వడం ఇటీవల పెరిగింది. కొన్నిసార్లు తాము భద్రతా బలగాల్లో పని చేస్తున్నామని, హఠాత్తుగా బదిలీ అయిన నేపథ్యంలో ఆయా వస్తువులను తీసుకువెళ్ళలేక విక్రయిస్తున్నట్లు పేర్కొంటున్నారు. దీంతో అనేక మందికి వారిపై నమ్మకం కలుగుతోంది. అలా బుట్టలో పడిన వారు ఆయా వస్తువుల్ని కొనేందుకు ఆసక్తి చూపి సంప్రదిస్తున్నారు. బేరసారాల తర్వాత అడ్వాన్స్‌ చెల్లించాలంటూ సైబర్‌ చీటర్లు షరతు పెడుతున్నారు. అప్పటికే పూర్తిగా వారి వల్లో పడిన బాధితులు వివిధ వాలెట్స్‌లోకి నగదు బదిలీ చేస్తున్నారు. డబ్బు తమకు చేరిన వెంటనే సైబర్‌ నేరగాళ్ల నుంచి స్పందన ఉండట్లేదు. ఇలా నగరానికి చెందిన అనేక మంది మోసపోయిన దాఖలాలు ఉన్నాయి.

తాజాగా రియల్టర్ల అవతారంలో...
ఇటీవల కాలంలో మార్కెట్‌ ప్లేస్‌ను ఆధారంగా చేసుకుని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కూడా పుంజుకుంది. ఇళ్లు, స్థలాలు అమ్మాలని భావించిన ప్రైవేట్‌ వ్యక్తులు, రియల్టర్లు సైతం మార్కెట్‌ ప్లేస్‌ను ఆశ్రయిస్తున్నారు. తాము అమ్మదలచిన దాని ఫొటోను పొందుపరుస్తూ ఏ రేటుకు విక్రయించనున్నామో అందులో పేర్కొంటున్నారు. ఆకర్షితులైన వారు మెసెంజర్‌ ద్వారా సంప్రదించి బేరసారాలు చేసుకుంటున్నారు. అనేక మంది మార్కెట్‌ప్లేస్‌ కేంద్రంగా స్థలాలు, ఇళ్ళు కొనుగోలు చేసిన వారూ ఉన్నారు. ఇదే సైబర్‌ నేరగాళ్లను ఆకర్షించింది. ప్రధానంగా మెట్రో నగరాల కేంద్రంగా వ్యవహారాలు నడిపే ఈ కేటుగాళ్లు అప్పటికే మార్కెట్‌ప్లేస్‌లో ఉన్న ప్రకటనల్ని కాపీ చేసి తమ సొంత వాటిగా పేస్ట్‌ చేస్తున్నారు. వాస్తవానికి ఆ నేరగాళ్ళు ఉండేది ఇతర నగరంలో అయినా డిమాండ్‌ ఉన్న ప్రాంతాలవి ఇలా కాపీ–పేస్ట్‌ చేస్తున్నారు. ఎవరైనా వీటికి ఆకర్షితులై మెసెంజర్‌ ద్వారా సంప్రదిస్తే స్థానికుల మాదిరిగానే జవాబు ఇస్తున్నారు. ఓ రేటు ఖరారైన తర్వాత కొనుగోలుదారులు ఆ స్థలానికి సంబంధించిన పత్రాలను సరిచూసుకోవడానికికోరుతుంటారు. ఇలా చేసిన వారి కోసం సదరు ప్రకటనలో ఉన్న సర్వే నెంబర్లు, ఇతర అంశాల ఆధారంగా బోగస్‌ ధ్రువీకరణలు తయారు చేస్తున్నా రు. వీటినే వాట్సాప్‌ లేదా ఈ–మెయిల్‌ ద్వా రా పంపి అడ్వాన్స్‌ పేరు తో అందినకాడికి కాజేస్తున్నారు.  

వాలెట్స్‌ ద్వారానే కాజేస్తున్నారు..
ఈ సైబర్‌నేరగాళ్లు నగదు లావాదేవీలన్నీ వివిధ రకాలైన వాలెట్స్‌ ద్వారానే నెరపుతారు. ఒక బాధితుడి నుంచి డబ్బు డిపాజిట్‌ చేయించుకున్న తర్వాత ఆ ఖాతాలు కనుమరుగు కావడం, ఫోన్‌ ద్వారా సంప్రదింపులు జరిపితే ఆ నెంబర్లు స్విచ్ఛాఫ్‌లో ఉండటం జరుగుతోంది. ఇలా వాలెట్స్‌లోకి వెళ్లిన డబ్బును సైబర్‌ నేరగాళ్లు తమ ఖాతాల్లోకి మళ్ళించుకుని కాజేస్తున్నారు. ఈ ఖాతాలు, వాలెట్స్‌ ఓపెన్‌ చేయడం కోసం ఆ కేటుగాళ్లు బోగస్‌ పేర్లు, తప్పుడు చిరునామాలు, గుర్తింపుకార్డులు సమర్పిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల దర్యాప్తు ఏమాత్రం ముందుకు సాగడం లేదు. ఇటీవల మార్కెట్‌ ప్లేస్‌ బాధితుల ఫిర్యాదులు ఎక్కువయ్యాయని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు చెబుతున్నారు. ఈ తరహా మోసాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో మార్కెట్‌ ప్లేస్‌ కేంద్రంగా జరుగుతున్న మోసాల పైనా ప్రచారం నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. అపరిచితులతో ఆర్థిక లావాదేవీలు వద్దని సైబర్‌క్రైమ్‌  వారిస్తున్నారు. తప్పనిసరై చేయాల్సి వచ్చినా వ్యక్తిగతంగా కలిసిన తర్వాతే చేపట్టాలని, కేవలం ఫోన్‌కాల్స్, మెసెంజర్స్‌ సంప్రదింపుల్ని ఆధారంగా చేసుకుని డబ్బు చెల్లించవద్దని స్పష్టం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement