
ఆత్మహత్య చేసుకున్న సుబ్రమణి, హత్యకు గురైన మేనక (ఫైల్)
తిరువొత్తియూరు: పుదుచ్చేరిలో కుమారుల ముందే భార్యను హత్యచేసి భర్త తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పుదుచ్చేరి ముత్యాలపేటనగర్ సౌత్‌అడ్రస్‌కు చెందిన సుబ్రమణి (41) జాలరి. ఇతని భార్య మేనక (36). వీరికి పదేళ్ల కుమార్తె, ఐదు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. సుబ్రమణి మానసిక రుగ్మతతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వారం రోజులుగా సుబ్రమణి భార్య మేనకతో తరచూ గొడవపడుతూ వస్తున్నాడు. సోమవారం ఉదయం భార్యాభర్తలిద్దరూ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌ను కలుసుకున్నారు.
ఉదయం 11.30 గంటలకు తిరిగి ఇంటికి వచ్చారు. సుబ్రమణి పైన ఉన్న గదికి వెళ్లాడు. 1.45 గంటలకు కిందకు దిగివచ్చి నిద్రపోతున్న మేనక మీద గ్యాస్ సిలిండర్‌తో దాడిచేశాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయమై ఘటనా స్థలంలోనే మృతి చెందింది. ఇదిచూసిన అతని కుమారుడు, కుమార్తె భోరున విలపించారు. వెంటనే పైకి పరుగెత్తిన సుబ్రమణి గది తలుపులు వేసుకున్నాడు. చిన్నారులు కేకలు విని అక్కడికి వచ్చిన ఇరుగుపొరుగు వారు ముత్యాలపేట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మిద్దెపైకి వెళ్లి గది తలుపులు పగులగొట్టి చూడగా సుబ్రమణి ఉరి వేసుకుని శవంగా వేలాడుతున్నాడు. సుబ్రమణి మానసిక ఒత్తిడి కారణంగా భార్యను హత్య చేశాడా? లేదా వేర్వేరు కారణాలా..? తెలియాల్సి ఉంది. ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.