నేనూ నీ వెంటే! | Couple Commits End lives in Tamil nadu | Sakshi
Sakshi News home page

నేనూ నీ వెంటే!

Published Sat, Mar 21 2020 8:18 AM | Last Updated on Sat, Mar 21 2020 8:18 AM

Couple Commits End lives in Tamil nadu - Sakshi

చెన్నై,తిరువొత్తియూరు: ఏడాది క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె మూడు నెలల గర్భవతి. చిన్నపాటి గొడవలకే కుంగిపోయారు. భర్తలేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. భార్య, బిడ్డ మృతికి కారణం తానేనని, వారు లేని జీవితం వ్యర్థమనుకున్న అతనూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బన్రూట్టి సమీపం తిరువదిగైలో కలకలం సృష్టించింది. వివరాలు.. కడలూరు జిల్లా బన్రూట్టి సమీపం తిరువడిగై ప్రాంతానికి చెందిన అళగానందన్‌ కుమారుడు మణికంఠన్‌ (29). అన్నాడీఎంకే ప్రముఖుడు. ఇతను ఆలయాలలో గోపుర విగ్రహాలకు వర్ణం వేసే వృత్తిని చేస్తున్నాడు. అతని భార్య మహేశ్వరి (25). వీరిద్దరూ గత ఏడాది జూన్‌ 23న ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత అదే ప్రాంతంలో వేరుగా కాపురం ఉంటున్నారు. మహేశ్వరి మూడు నెలల గర్భిణి. దంపతుల మధ్య తరచూ సమస్యలు ఏర్పడుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం మణికంఠన్‌ పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు.(ప్రేమా.. ఇది నీకు న్యాయమా?)

గురువారం బయటకు వెళ్లిన అతను రాత్రి 10 గంటల సమయంలో తిరిగి ఇంటికి వచ్చాడు. తరువాత భోజనం చేసి నిద్రపోయాడు. తెల్లవారుజామున మణికంఠన్‌ ఇంటి తలుపులు తెరి ఉన్నాయి. దీన్ని చూసిన ఇరుగుపొరుగు వారు వెళ్లి చూడగా మహేశ్వరి పడక గదిలో శవంగా పడి ఉంది. ఆమె భర్త ఫ్యాన్‌కు ఉరి వేసుకుని శవంగా వేలాడుతున్నాడు. సమాచారం అందుకున్న బన్రూట్టి పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. పడకగదిలో తనిఖీ చేయగా మణికంఠన్‌ రాసిన ఉత్తరం లభ్యమైంది. అందులో తాను గురువారం రాత్రి ఇంటికి వచ్చిన సమయంలో తన భార్య ఉరి వేసుకుని శవంగా వేలాడుతోందని, ఆ దుఃఖాన్ని తట్టుకోలేక ఆమెను కిందకు దించి పడకపై పడుకోబెట్టానని తెలిపాడు. భార్యలేని జీవితం వద్దనుకుని తనువు చాలిస్తున్నట్టు పేర్కొన్నాడు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శవ పరీక్ష కోసం విల్లుపురం ముండియంబాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ లోపు మహేశ్వరి తల్లిదండ్రులు, బంధువులు పలు అనుమానాలు రేకెత్తించారు. తన కుమార్తెను కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, దీనిపై విచారణ జరిపించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement