రెండు రోజులు..రూ.4.9 కోట్లు! 

City police officers captured above 4 crores of money - Sakshi

స్వాధీనం చేసుకున్న నగర పోలీసు అధికారులు 

రెండు కేసుల్లో పార్లమెంట్‌ ఎన్నికల లింకులు బహిర్గతం 

వివరాలు వెల్లడించిన సిటీ కొత్వాల్‌ అంజనీకుమార్‌ 

వాహనాల తనిఖీల్లో పట్టుబడినవి 2.6 కోట్లు 

పక్కా సమాచారంతో చిక్కినవి మరో 2.3 కోట్లు 

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాల మేరకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. నగదు అక్రమ రవాణాపై డేగకన్ను వేశారు. ఫలితంగా శని, ఆదివారాల్లోనే టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు రూ.4,92 కోట్ల నగదును స్వాధీనం చేసుకుని 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మొత్తంలో రూ.2.60 కోట్లు పక్కా సమాచారం ఆధారంగా, మరో రూ.2.3 కోట్లు వాహన తనిఖీల్లో భాగంగా పట్టుబడినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ ఆదివారం వెల్లడించారు. మొత్తం ఎనిమిది కేసులకుగాను రెండింటిలో పార్లమెంట్‌ ఎన్నికల లింకులు స్పష్టంగా బహిర్గతమైనట్లు చెప్పారు. వీటితోపాటు మిగిలిన వాటిలోనూ సూత్రధారుల్ని గుర్తించడానికి లోతుగా దర్యాప్తు చేస్తున్నామని కొత్వాల్‌ పేర్కొన్నారు.

టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ పి.రాధాకిషన్‌రావు, అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌లతో కలసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని ఓ అపార్ట్‌మెంట్‌ కేంద్రంగా భారీ మొత్తం చేతులు మారుతోందని ఉప్పందడంతో పశ్చిమమండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌పై దాడి చేసి వ్యాపారవేత్తలు ఎం.సాత్విక్‌రెడ్డి, సౌరవ్‌ గోయల్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద ఉన్న రూ.ఇరవై ఆరు లక్షల 19 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. వివిధ పార్టీలకు అందించడానికే ఈ మొత్తాన్ని సిద్ధం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ముసారాంబాగ్‌ మీదుగా వెళ్తున్న స్విఫ్ట్‌ కారులో భారీ మొత్తం రవాణా అవుతున్నట్లు సమాచారం అందడంతో నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దారికాచి దానిని తనిఖీ చేయగా రూ.34 లక్షల 30 వేల నగదు బయటపడింది. కారులో ఉన్న ఎల్బీనగర్‌వాసి టి.కాశినాథ్‌రెడ్డి, సూర్యాపేట జిల్లా భూక్యా తండా వాసి భూక్యా రవిని అదుపులోకి తీసుకుని విచారించారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీచేస్తున్న ఓ అభ్యర్థి కోసం రవాణా చేస్తున్నట్లు బయటపెట్టారు. ఆయన సూచనల మేరకు బూత్‌ లెవల్‌ కమిటీ మెంబర్లకు పంపిణీ చేయడానికి తీసుకువెళ్తున్నట్లు వెల్లడించారు. 

బంజారాహిల్స్‌లో రూ.కోటి స్వాధీనం 
వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14 ప్రాంతంలో నిఘా వేసి అనుమానాస్పదంగా వస్తున్న ఇన్నోవా కారును ఆపి సోదా చేశారు. అందులో రూ.కోటి నగదు బయటపడింది. కారులో ఉన్న ఎస్సార్‌నగర్‌వాసి మల్లారెడ్డి శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు ఈ మొత్తానికి సంబంధించి లెక్కలు చూపలేదు. దీంతో వాహనాన్ని, నగదును స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్‌ స్వస్థలం ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అప్పారావుపేట. ఈ మొత్తాన్ని అక్కడకు తరలిస్తున్నాడా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి మీదుగా డబ్బు రవాణా జరుగుతోం దనే సమాచారంతో మధ్యమండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రంగంలోకి దిగారు.

ఆ మార్గంలో వస్తున్న ఇన్నోవా కారును ఆపి తనిఖీ చేయగా అందు లో రూ.కోటి లభించాయి. దాని డ్రైవర్‌ బోడ్డుపల్లి శ్రీనయ్య స్వస్థలం నల్ల గొండలోని పులిచెర్వ. ఇతడు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10 లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ 564/38లో నివసిస్తున్నాడు. 20 ఏళ్లుగా నల్లగొండ జిల్లాకు చెందిన ఓ కీలకనేత, మాజీమంత్రి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. జయవీర్‌రెడ్డి అనే వ్యక్తి సూచనల మేరకు నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఓటర్లకు పంపిణీ చేయడానికి నగదు తీసుకువెళ్తున్నట్లు వెల్లడించాడు. జయవీర్‌రెడ్డి ఓ మాజీమంత్రి కుమారుడు అని తెలుస్తోంది. ఈ నగదు ఎక్కడ నుంచి డ్రా అయింది? అనే విషయాలను ఆరా తీస్తున్నామని తెలిపారు. పంజగుట్ట, ఓయూ, గోల్కొండ, ఎస్సా ర్‌నగర్, జూబ్లీహిల్స్, టప్పాచబుత్ర పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో రూ.2.32 కోట్లకుపైగా స్వాధీనమైంది. ఆయా పీఎస్‌లలో కేసులు నమోదు చేసి నగదును ఐటీ శాఖకు అప్పగిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top