ఓడేడ్‌లో 675 గ్రాముల గంజాయి పట్టివేత  | Captur of 675 grams of Marijuana | Sakshi
Sakshi News home page

ఓడేడ్‌లో 675 గ్రాముల గంజాయి పట్టివేత 

Oct 24 2017 2:27 AM | Updated on Aug 21 2018 6:00 PM

Captur of 675 grams of Marijuana - Sakshi

ముత్తారం(మంథని): పెద్దపల్లి జిల్లా ముత్తా రం మండలం ఓడేడ్‌లో గంజాయి కోసం పోలీసులు సోమవారం ఇంటింటా సోదాలు నిర్వహించారు. ఎస్‌ఐ చుంచు రమేశ్‌ ఆధ్వర్యంలో పోలీసు బలగాలు గంజాయి కోసం గ్రామంలోని అన్ని ఇళ్లను తనిఖీ చేశారు. గ్రామానికి చెందిన సపుల నాగరాజు ఇంటిలో సుమారు 675 గ్రాముల గంజాయి పట్టుకున్నారు. తహసీల్దార్‌ ఇందారపు పుష్పలత పంచానామా నిర్వహించారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.

కాగా, రాజకీయ కుట్రల్లో నాగరాజును బలిపశువును చేస్తున్నారని అతని భార్య శిరీష, అమ్మమ్మ బొందవ్వ ఆరోపించారు. నాగరాజును ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్న నేపథ్యంతో తమ ఇంట్లో గంజాయిని ఎలా నిల్వ చేసుకుంటామని ప్రశ్నించారు. రాజకీయ రంగు పులుముకున్న గంజాయి కుట్ర కేసులో నాగరాజును బలిపశువును చేయడం కోసమే పోలీసులు వెంట తెచ్చిన గంజాయిని ఇంట్లో పెట్టి దొరికినట్లు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఐ రమేశ్‌ విలేకరులతో మాట్లాడుతూ ఓడేడ్‌లో గంజాయి నిల్వ ఉందని అందిన పక్కా సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా నాగరాజు ఇంట్లో గంజాయి దొరికిందని వెల్లడించారు.  

కుట్ర కేసులో నిందితుడు 
రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన గంజాయి కుట్ర కేసులో సపుల నాగరాజు పేరు కూడా ఉంది. టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు పోతుపెద్ది కిషన్‌రెడ్డి ఇంట్లో గంజాయి పెట్టేందుకు మాజీ సర్పంచ్‌ ఓగులవేన సుదర్శన్, అదే గ్రామానికి చెందిన ఇల్లెందుల భార్గవ్‌తో కలిసి కుట్ర పన్నగా, అందుకు మాజీ మంత్రి శ్రీధర్‌భాబు సహకరించారని ఆరోపణలపై చిక్కడపల్లి ఠాణాలో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే, కిషన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం వేకువ జామున సుదర్శన్, భార్గవ్‌లను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి కుట్ర కేసులో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న సపుల నాగరాజును ఆదివారం తెల్లవారు జామున అదుపులోకి తీసుకుని కంప్యూటర్, పది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం అయింది. అయితే, సోమవారం నాగరాజును మరోసారి గ్రామానికి తీసుకువచ్చిన పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహించి 675 గ్రాముల గంజాయి దొరికినట్లు ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.  

శ్రీధర్‌బాబు కేసులో ఇద్దరు అరెస్ట్‌ 
హైదరాబాద్‌: మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుపై నమోదైన గంజాయి కుట్ర కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులను హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. నిందితులు ఓడేడ్‌ మాజీ సర్పంచ్‌ సుదర్శన్‌తోపాటు 14 ఏళ్ల బాలుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement