
కర్ణాటక ,శిడ్లఘట్ట: నిండు గర్భిణి అయిన మహిళను ఆమె బావ దారుణంగా పొడిచి హత్య చేసిన సంఘటన శిడ్లఘట్ట తాలూకాలోని దిబ్బూరుహళ్ళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆనేమడుగు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. నిందితుడు హరీష్‌కుమార్ కాగా, హతురాలు నాగజ్యోతి (26). వివరాలు.. నవీన్‌చంద్ర, నాగజ్యోతి దంపతులు. నవీన్ అన్న హరీష్‌కుమార్. అందరూ ఒకే ఇంట్లో ఉంటారు. నాగజ్యోతికి తన బట్టలను ఉతకాలని హరీష్‌కుమార్ చెప్పగా, ఆమె గర్భిణి కావడంతో అలసటతో టీవీ చూస్తూ కూర్చుంది. ఆ సమయంలో భర్త సీమంతం కోసం కొత్త బట్టలు తేవడానికి చింతామణికి వెళ్లాడు. హరీష్ కుమార్ కోపం పట్టలేక ఇంటిలో ఉన్న కత్తితో ఆమెను పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్తుండగా కన్నుమూసింది.దిబ్బూరుహళ్ళి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి హరీష్ కుమార్‌ను అరెస్టు చేశారు.