బాలుడి కిడ్నాప్‌ విషాదాంతం

Boy Kidnap Case End With Tragedy - Sakshi

డబ్బు కోసం దుండగుల ఘాతుకం..

నెలన్నర తర్వాత కళేబరం గుర్తింపు

అనంతపురం సెంట్రల్‌: బాలుడి కిడ్నాప్‌ విషాదాంతంగా ముగిసింది. కుమారుడి కోసం నిద్రాహారాలు మాని, కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న తల్లిదండ్రుల ఆశలు అడియాసలయ్యాయి. దుండగుల చేతిలో దారుణహత్యకు గురై.. నెలన్నర తర్వాత కళేబరంగా కనిపించిన కుమారుడిని చూసి గుండెలవిసేలా రోదించారు. వివరాల్లోకెళితే.. అనంతపురం రూరల్‌ మండలం కక్కలపల్లికాలనీ పంచాయతీ పరిధిలోని నందమూరినగర్‌కు చెందిన సురేష్, ఈశ్వరమ్మ దంపతులు. వీరి ఒక్కగానొక్క కుమారుడు గౌతమ్‌(8) ఎస్కేయూ సమీపంలోని కేంద్రీయ విద్యా లయంలో మూడో తరగతి చదువుతున్నాడు. జనవరి 24న బుధవారం పాఠశాలకు వెళ్లిన గౌతమ్‌ కళ్యాణదుర్గం రోడ్డులోని జొన్నా ఐరన్‌మార్ట్‌ వద్ద దిగి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా దుండగులు కిడ్నాప్‌ చేశారు. అదే రోజు రాత్రి బాలుడి తల్లిదండ్రులు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నమ్మించి తీసుకెళ్లి.. చంపేశారు
గత ఏడాది అయ్యప్పమాల వేసిన సమయంలో సురేష్‌కు జాకీర్‌కొట్టాలకు చెందిన ఆటోడ్రైవర్‌ సాయి పరిచయమయ్యాడు. ఐచర్‌ కంపెనీలో పనిచేస్తున్న సురేష్‌ వద్ద డబ్బులు చాలా ఉన్నాయని భావించిన సాయి.. ఒక్కగానొక్క కుమారున్ని కిడ్నాప్‌ చేసి సులువుగా డబ్బులు సంపాదించాలని పథకం రచించాడు. తన మిత్రుడు మల్లితో కలిసి కిడ్నాప్‌నకు పథక రచన చేశాడు. జనవరి 24న రోజూ గౌతమ్‌ స్కూలు బస్సు దిగిన వెంటనే ఇంటి వద్ద దింపుతామని సాయి నమ్మబలికాడు. పరిచయమున్న వ్యక్తి కావడంతో గౌతమ్‌ అమాయకంగా వారి ద్విచక్ర వాహనం ఎక్కాడు. కొంతదూరం వెళ్లాక  స్విమ్మింగ్‌ఫూల్‌ వెళదామని నమ్మబలికి ఆత్మకూరు మండలం బి.యాలేరు చెరువు వద్దకు తీసుకెళ్లారు.

డబ్బు డిమాండ్‌ చేయాలని భావించినా.. తెలిసిపోతుందనే భయంతో ఫోన్‌ చేయలేకపోయారు. తాడు తీసుకొని చిన్నారి గొంతు బిగించి హత్య చేశారు. అనంతరం కవర్‌లో మూటకట్టి చెరువులో పడేశారు. నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు నిందితులు ఆటోడ్రైవర్‌ సాయి, మల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం అంగీకరించారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు డీఎస్పీ వెంకట్రావ్‌ ఆధ్వర్యం లో పోలీసులు బుధవారం మధ్యాహ్నం బి.యాలేరు చెరువు వద్దకు వెళ్లి.. స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీయించారు. నెలన్నర రోజులు కావడంతో కళేబరంగా మారిపోయింది. బాలుడి దుస్తులు గమనించి తల్లిదండ్రులు, బంధువుల నిర్దారించారు. దేవుడా ఎంత పనిచేశావంటూ బోరున విలపించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top