బెజవాడలో భారీ డెకాయిటీ ఆపరేషన్‌

Big Decoity Operation In Vijayawada - Sakshi

హైదరాబాద్‌ టూ విజయవాడ వయా ముంబై

విజయవాడ నగర పోలీసుల అదుపులో హవాలా మనీ

పోలీసులమని రూ. 1.70 కోట్లు దోచుకున్న దొంగలు

రూ. 1.25 కోట్లను స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు

ఈడీ, ఐటీ విభాగాలకు తెలియజేస్తామన్న సీపీ ద్వారకా తిరుమలరావు

లోతుగా విచారిస్తే వెలుగులోకి అసలు విషయాలు

సాక్షి, అమరావతి బ్యూరో : బెజవాడను హవాలా డబ్బు ముంచెత్తుతోంది. రాజధాని ఏర్పడిన అనంతరం..వివిధ వ్యాపార వర్గాలకు చెందిన బడాబాబులు తమ తమ వ్యాపకాలకు ఈ నగరాన్ని ఆవాసంగా మార్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో అసాంఘిక కార్యకలాపాలకు విజయవాడ నగరం కేంద్రం కావడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడకు ముంబై రాజధాని నుంచి హవాలా మార్గం ద్వారా తరలించారని అనుమానిస్తున్న రూ. 1.25 కోట్లను మంగళవారం నగర టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఇందుకు ఊతమిస్తోంది. కాగా, గుట్టు చప్పుడు కాకుండా ఎన్నో రెట్ల డబ్బు హవాలా మార్గంలో చేతులు మారుతోందని ‘సాక్షి’ మార్చి 24వతేదీన ‘కోడ్‌.. డీల్‌’ పేరిట ఓ కథనాన్ని ప్రచురించింది. అచ్చం ఆ కథనంలో సాక్షి పేర్కొన్నట్లుగానే ..స్వాధీనం చేసుకున్న డబ్బు హవాలా మార్గంలో వచ్చిందేననే అనుమానాన్ని పోలీసులు సైతం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్‌కు చెందిన మిర్చి వ్యాపారి అభినవ్‌రెడ్డి ఇటీవల తన వ్యాపారాన్ని ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడకు విస్తరించారు.

ఈ నేపథ్యంలో తన వద్ద నమ్మకంగా పనిచేస్తున్న విశాఖకు చెందిన నాగరాజుకు విజయవాడలోని వ్యాపారుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసే పనిని అప్పగించారు. రోజుకు రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు వసూలు చేయాల్సి ఉంటుంది. దీంతో నాగరాజు తనకు పరిచయమున్న విశాఖకు చెందిన రెడ్డిపల్లి కిశోర్‌ అలియాస్‌ నాని సహాయం  తీసుకున్నాడు. ఇందుకోసం విజయవాడ నగరంలోని ఓ హోటల్‌లో రూమ్‌ను అద్దెకు తీసుకున్నారు. రోజూ వసూలు చేసి తీసుకొచ్చిన డబ్బును హోటల్‌ రూమ్‌లో ఉంచేవారు. అయితే ఆ డబ్బుకు కాపలా కోసం మరొకరిని  పెట్టాలనే ఉద్దేశంతో నానికి తమ్ముడు వరుసైన దాస్‌ను విశాఖ నుంచి రప్పించి రూమ్‌లో కాపలా పెట్టారు. అసలే ఎన్నికల వేళ రూ.లక్షల్లో సొమ్మును నగరంలో అటూ ఇటూ తీసుకెళ్లడం ఇబ్బందిగా ఉంటుందని గ్రహించిన అభినవ్‌రెడ్డి ఓ రోజు నాగరాజుతో మాట్లాడుతూ డబ్బు తరలించే సమయంలో పోలీసులకు పట్టుబడితే రూ.నాలుగైదు లక్షలైతే ఎలాంటి హడావుడి చేయకుండా వదిలేయమని ఫోన్లో చెబుతుండగా నాని విన్నాడు. దీంతో నానికి ఈ డబ్బును కాజేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే తనకు ఇదివరకే పరిచయమున్న మైలవరానికి చెందిన రవీంద్రకు సమాచారమందించాడు. దీంతో రవీంద్ర తన స్నేహితులు హర్షవర్ధన్, భవానీ శంకర్, అమర్‌చంద్‌తో కలసి డబ్బు దోచుకునేందుకు పక్కా ప్రణాళిక రచించాడు. ఇందుకోసం పాతబస్తీ ప్రాంతంలో ఖాకీ దదుస్తులు, నల్లబూట్లు కొనుగోలు చేసి.. మార్చి 18, 19వ తేదీల్లో డబ్బు దోచుకునేందుకు రెండుసార్లు యత్నించి విఫలమయ్యారు. అయితే అదేనెల 22వ తేదీన  నాగరాజు, నాని కలిసి రూ .30 లక్షలు హైదరాబాద్‌కు తీసుకెళుతుండగా వీరి వాహనాన్ని కొత్తూరు, తాడేపల్లి సమీపంలో హర్షవర్ధన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులమంటూ నిలిపేశాడు. తర్వాత రవీంద్రను సీఐగా హర్షవర్ధన్‌ పరిచయం చేయడం.. ఆ తర్వాత అదే వాహనంలో  రూ.కోటి డబ్బులున్న బ్యాగు కోసం హోటల్‌కు చేరుకుని నాగరాజును కొట్టి ఆ బ్యాగును తీసుకెళ్లారు. దాస్‌ను కూడా వారి వాహనంలో తీసుకెళ్లి మధ్యలో వదిలేశారు. ఇదిలా ఉండగా.. మరోచోట దాచిన రూ.45 లక్షల బ్యాగుతో నాని రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. అయితే ఈ డబ్బును కూడా పోలీసులు పట్టుకెళ్లారని చెప్పి.. మనం పంచుకుందామని నాని ఆశ పెట్టడంతో నాగరాజు ఒప్పుకుని ఆ డబ్బును అంతా కలిసి పంచుకున్నారు. 

ఏడుగురు అరెస్టు.. 
టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల పేరు చెప్పి రూ. 1.70 కోట్లు దోపిడీ చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దోపిడీలో ప్రధాన నిందితుడు రవీంద్ర  పరారీలో ఉన్నాడని.. నాని, భవానీశంకర్, హర్షవర్ధన్, అమర్‌చంద్, దాసు,నాగరాజును అరెస్టు చేసి రూ. 1.25 కోట్లు రికవరీ చేశామని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. 

అభినవ్‌ ఫిర్యాదుతో బయటపడ్డ హవాలా మార్గం.. 
పోలీసుల పేరిట గుర్తు తెలియని వ్యక్తులు రూ. 1.70 కోట్లు దోచుకెళ్లడంతో మిర్చి వ్యాపారి అభినవ్‌రెడ్డి విజయవాడ రెండో పట్టణ పోలీసులకు మార్చి 26న ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అనుమానంతో నాగరాజును పలు దఫాలు విచారించగా.. అసలు డబ్బును ఎలా వసూలు చేసేది.. ఎక్కడ ఉంచేది.. అందుకు ఎవరెవరు సాయం చేశారు అన్న వివరాలు వివరించాడు. ఆ తర్వాత అభినవ్‌ను విచారించగా.. తాను ముంబైకి చెందిన ఓ కంపెనీకి బ్యాంకు అకౌంట్‌ నంబరు ద్వారా రూ. కోటి జమ చేస్తే.. ఆ డబ్బును విజయవాడలో ఓ కోడ్‌ను ఉపయోగించి అందజేస్తారని వివరించాడు. దీంతో ఈ సొమ్ము హవాలా మార్గంలోనే నగరానికి వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. గత పది రోజుల్లో ఈ మార్గం ద్వారా దాదాపు రూ. 7 కోట్లు నగరానికి వచ్చిందని సమాచారం. దీంతో ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఆదాయపన్ను శాఖకు, ఈడీ విభాగానికి తెలియజేస్తామని నగరపోలీసు కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ కేసును లోతుగా విచారిస్తాని.. ఎన్నికల నేపథ్యంలో పంపిణీ చేయడానికి వచ్చిన సొమ్ముగానే తాము అనుమానిస్తున్నామని.. విచారణలో పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top