ఏటీఎం దొంగ అరెస్ట్‌

ATM Thief Arrest In Anantapur - Sakshi

కళ్యాణదుర్గం: అమాయకులను లక్ష్యంగా చేసు కుని ఏటీఎం ద్వారా నగదు చేయడానికి సహాయపడుతున్నట్టు నటించి.. వారికి ఇతరుల ఏటీఎం కార్డు అంటగట్టి.. తర్వాత వారి కార్డుతో డబ్బు చేసుకునే దొంగను బ్యాంకర్లు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకెళితే.. ఈ నెల ఐదో తేదీన ముదిగల్లు క్రాస్‌లో గల స్టేట్‌బ్యాంకులో రాయదుర్గం ప్రాంతానికి చెందిన ఓ యువకుడు మాటువేశాడు. ముదిగల్లు రైతు రూ.లక్ష అవసరం కావడంతో అక్కడకు వచ్చాడు. ఏటీఎం ద్వారా డ్రా చేసుకునే విధానం తెలియకపోవడంతో ఓ వ్యక్తి ద్వారా తొలుత రూ.40 వేలు డ్రా చేయించుకున్నాడు. మిగిలిన మొత్తం కావాలంటే మరో రోజు రావాల్సిందేనని ఆ వ్యక్తి చెప్పి వెళ్లిపోయాడు.

ఇదంతా గమనించిన యువకుడు ‘పెద్దాయనా.. ఆయన మాటలెందుకు వింటావు..ఇంకా ఎక్కువ డ్రా చేయొచ్చులే’ అంటూ రైతును నమ్మించాడు. రైతు వెంకటేశులు ఏటీఎం తీసుకుని స్వైపింగ్‌లో డ్రా చేస్తున్నట్లు నటించి.. తర్వాత డబ్బు రాలేదని చెప్పి అతడి ఏటీఎం కార్డును తనవద్ద ఉంచుకుని మంగమ్మ పేరుపై గల ఏటీఎం కార్డును అందజేశాడు. ఏడో తేదీ రైతు  ఏటీఎంకు, బ్యాంకుకు వెళ్లగా డబ్బు డ్రా చేసేకోలేకపోయాడు. అధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఏటీఎం కార్డు మారిందని తేల్చారు. అనంతరం సదరు ఏటీఎంను బ్లాక్‌ చేశారు. అయితే అంతకుమునుపే యువకుడు రూ.12వేలు డ్రా చేసేశాడు.

శుక్రవారం రోజు అదే స్టేట్‌బ్యాంక్‌లో గోళ్ల వీఆర్‌ఏ నాగరాజును కూడా ఆ యువకుడు మోసం చేశాడు. ఏటీఎం ద్వారా రూ.4వేలు తస్కరించాడు.
శుక్రవారం స్టేట్‌బ్యాంకుకు వెళ్లి స్వైపింగ్‌లో స్లిప్‌ పేపర్‌ రావడం లేదని సిబ్బందికి చెప్పి వెళ్లాడు. అప్పటికే అప్రమత్తమైన బ్యాంకు మేనేజర్‌ కుమార్, సిబ్బంది పోలీసులను పిలిపించి ఆ యువకుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సీఐ శివప్రసాద్, ఎస్‌ఐ జమాల్‌బాషాలు సదరు బ్యాంకుకు వెళ్లి సీసీ ఫుటేజీలను పరిశీలించినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి సూత్రధారులు, పాత్రదారులు ఇంకా ఎవరన్నదీ పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top