కస్టోడియనే సూత్రధారి

ATM Robbery Gang Held in Guntur - Sakshi

ఏటీఎం వాహనంలో నగదు చోరీ కేసులో నిందితులు అరెస్టు

ఈ నెల 9న ఏటీఎంకు నగదు నింపే వ్యాన్‌లో రూ.39 లక్షల చోరీ

ఐదుగురు నిందితులను అరెస్టు చేసిన  పోలీసులు

వివరాలు వెల్లడించిన అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి

సాక్షి, గుంటూరు: ఈ నెల 9న గుంటూరు అమరావతి రోడ్డులోని నగరాలు సమీపంలో సెంట్రల్‌ బ్యాంకు ఏటీఎంలో నగదు నింపే వాహనంలో రూ.39 లక్షలు చోరీ కేసు మిస్టరీ వీడింది. ఏటీఎంలో నగదు నింపే కస్టోడియన్‌ నాగేంద్రబాబే చోరీకి ప్రధాన సూత్రధారిగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, రెండు బైక్‌లు, నాలుగు సెల్‌ఫోన్‌లు, రూ.39 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలోని అర్బన్‌ సమావేశ మందిరంలో ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రైటర్స్‌ సేఫ్‌ గార్డు ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో ప్రవీణ్, సొల్లా వెంకట నాగేంద్రబాబు కస్టోడియన్లుగా, భోజారావు గన్‌మెన్‌గా, ఉల్లం తిరుపతిరావు ఏటీఎంకు డబ్బు నింపే వాహనం డ్రైవర్‌గా పని చేస్తున్నారు. తిరుపతిరావు తాను ప్రయాణించిన దూరం కంటే ఎక్కువ దూరం ప్రయాణించినట్టు ట్రావెలింగ్‌ అలవెన్స్‌ పొందుతూ ఉండేవాడు. ఈ ట్రావెలింగ్‌ అలవెన్స్‌ అనుమతికి కస్టోడియన్‌ సంతకం పెట్టాల్సి ఉంటుంది. తప్పుడు ట్రావెలింగ్‌ అలవెన్స్‌పై నాగేంద్రబాబు సంతకం పెట్టడాన్ని ప్రవీణ్‌ వ్యతిరేకించాడు. దీంతో నాగేంద్రబాబు, తిరుపతిరావు, భోజారావు ప్రవీణ్‌తో గొడవపడ్డారు. 

ప్రవీణ్‌ను ఇబ్బంది పెట్టాలని...  
భేదాభిప్రాయాల నేపథ్యంలో ప్రవీణ్‌ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అతను డ్యూటీలో ఉన్న సమయంలో వ్యాన్‌లో ఉన్న డబ్బు కాజేయాలని పథకం రచించారు. ఇందులో భాగంగా నాగేంద్ర తన స్వగ్రామమైన మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన రాజబోయిన వెంకట నాగశివ, కంపసాటి గంగాధర్‌లను భోజారావు, తిరుపతిరావులకు పరిచయం చేశాడు. పథకం ప్రకారం ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు నగదుతో ఉన్న వాహనం నగరాలులోని సెంట్రల్‌ బ్యాంకు వద్ద రోడ్డుపై నిలిపి డ్రైవర్‌ తిరుపతిరావు తనకు సొంత పని ఉందని ప్రవీణ్‌ను బ్యాంకులోకి తీసుకువెళ్లాడు. ఈ సమయంలో నాగ వెంకటసాయి, గంగాధర్‌ వ్యాన్‌లోని రూ.39 లక్షల నగదుతో ఉన్న బాక్స్‌ను చోరీ చేసి బైక్‌పై నవులూరుకు వెళ్లారు. 

250 సీసీ కెమెరాలు పరిశీలించగా...
చోరీ ఘటనపై రెండు ప్రత్యేక బృందాలను ఎస్పీ అప్పట్లో ఏర్పాటు చేశారు. ఈ బృందాలు అర్బన్‌ జిల్లాలోని 250 సీసీ కెమెరాలను పరిశీలించగా ప్రాథమికంగా నిందితులను గుర్తించిన అనంతరం, టెక్నికల్‌ ఆధారాలు సేకరించి నిర్ధారించారు. చోరీ జరిగిన అనంతరం నిందితులు వెళ్లిన ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా వారు వేసుకున్న దుస్తులు, వాడిన బైక్‌ను గుర్తించారు. ఈ ఆధారాల వల్ల నిందితులు ఎవరో గుర్తించడం కుదరకపోవడంతో, నిందితులు ఎక్కడి నుంచి వచ్చారనే దానిపై విచారణ సాగించారు. ఈ నేపథ్యంలో సీసీ కెమెరాలు వెరిఫై చేయగా నవులూరు ప్రాంతంలో నిందితులు ప్రారంభమైనట్టు గుర్తించి, చోరీ అనంతరం కూడా వాళ్లు ఆ ప్రాంతానికి వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో నిర్ధారణ అవడంతో ఆ కోణంలో కేసు దర్యాప్తు చేశారు. సీసీ కెమెరాల్లోని దృశ్యాల ఆధారంగా గుర్తించిన నిందితుల కాల్‌డేటా పరిశీలించగా వీళ్లు తిరుపతిరావు స్నేహితులని గుర్తించిన పోలీసులు తిరుపతిరావును అదుపులోకి తీసుకుని విచారించగా విషయాన్ని చోరీ వివరాలు వెల్లడించినట్టు సమాచారం. 

కేసును ఛేదించిన సిబ్బందికిఅభినందనలు  
కేసును త్వరగా ఛేదించి, 100 శాతం రికవరీ చేసిన నల్లపాడు పోలీసులను, సీసీఎస్, ఐటీ  కోర్‌ సిబ్బందిని ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించారు. సీఐ కె.వీరాస్వామి, ఎస్‌ఐలు విశ్వనాథ్, రవీంద్ర, అమరవర్థన్, ఇతర సిబ్బందికి క్యాష్‌ రివార్డు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ అడ్మిన్‌ గంగాధరం, సీసీఎస్‌ ఏఎస్పీ మనోహర్, డీఎస్పీలు కమలాకర్, ప్రకాశ్, బాలసుందరరావు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top