ఆశారాం బాపుకు శిక్ష ఖరారు | Asaraam Bapu Sentenced To Life Iimprisonment By Jodhpur Court | Sakshi
Sakshi News home page

ఆశారాం బాపుకు జీవిత ఖైదు

Apr 25 2018 2:49 PM | Updated on Jul 23 2018 8:49 PM

Asaraam Bapu Sentenced To Life Iimprisonment By Jodhpur Court - Sakshi

జోధ్‌పూర్‌ : 16 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు జోధ్‌పూర్‌ ట్రయిల్‌ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరికి 20 ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. కాగా 2013 సంవత్సరం నుంచి జైలు ఊచలు లెక్కిస్తున్న ఆశారాం బాపూపై మూడు అత్యాచార కేసులు నమోదై ఉన్నాయి. 2013 సంవత్సరం ఆగస్టులో పదహారేళ్ల అమ్మాయి జోధ్‌పూర్‌లోని ఆశ్రమంలో ఆశారాం తనపై లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.

ఆ అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలిస్తానని మభ్యపెట్టిన ఆశారాం ఆమెపై అత్యాచారం జరిపినట్టు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కేసు నమోదైనప్పటికీ ఆశారాం బాపూ పోలీసుల ఎదుట హాజరు కాలేదు. అందరి కళ్లు గప్పి ఇండోర్‌లోని తన ఆశ్రమంలో దాక్కున్నాడు. నాన్‌బెయిల్‌బుల్‌ అరెస్ట్‌ వారెంట్లు జారీ చేసినప్పటికీ అతను బయటకి రాలేదు. అతనిని అరెస్ట్‌ చేయడం కూడా ఒక ప్రహసనంగానే మారింది. ఈ సందర్భంగా పోలీసులకు, ఆశారాం అనుచరులకు మధ్య తీవ్రమైన ఘర్షణలు కూడా జరిగాయి.

చివరికి 2013 సెప్టెంబర్‌ 1న ఆశారాంను రాజస్థాన్‌ జోధ్‌పూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఈ కేసులో సాక్షులపైన ఆశారాం బాపూ ప్రైవేట్‌ సైన్యం బెదిరింపులు, దాడులకు దిగింది. తన కండబలం ప్రదర్శించింది. ఆశారాంకు బెయిల్‌ ఇవ్వకపోతే చంపేస్తామంటూ కేసును విచారించిన  న్యాయమూర్తిని కూడా బెదిరించారు. దీంతో సుప్రీంకోర్టులో కూడా అతనికి బెయిల్‌ లభించలేదు. ఈ కేసులో ఆశారాంపై ఆరోపణలు రుజువు కావడంతో ఆయనకు న్యాయస్థానం జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెల్లడిచింది. దోషిగా తేల్చింది. బాపుతో పాటు కేసులోని ఐదుగురు నిందితుల్లో ఇద్దరిని దోషులుగా పేర్కొన్న కోర్టు మరో ఇద్దరిని నిర్దోషులుగా పేర్కొంది. దోషులుగా తేలిన ఇద్దరికి ఇరవై ఏళ్లు జైలు శిక్ష విధించింది.

Advertisement
 
Advertisement
Advertisement