ఏసీబీ వలలో ఏఈ

AE Held in While Demanding Bribery Khammam - Sakshi

కాంట్రాక్టర్‌ నుంచి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన ఇరిగేషన్‌ ఇంజనీర్‌

కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపిన అధికారులు

ఇల్లెందు: నీటిపారుదల(ఇరిగేషన్‌) శాఖలో ఏఈగా పనిచేస్తున్న నవీన్‌కుమార్‌ ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ వలకు చిక్కాడు. ఏసీబీ వరంగల్‌ డీఎస్పీ మధుసూదన్‌ విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.. ఇల్లెందు మండలం మర్రిగూడెం పంచాయతీ కోటన్ననగర్‌ గ్రామంలోని అనంతారం చెరువును మిషన్‌ కాకతీయ ట్రిపుల్‌ ఆర్‌ పథకం కింద ఇల్లెందుకు చెందిన కాంట్రాక్టర్‌ గుండ్ల రమేష్‌ మరమ్మతు చేశారు. ఈ పనులు గత వేసవిలోనే పూర్తయ్యాయి. ఈ మేరకు ఏఈ నవీన్‌కుమార్‌ ఎంబీ కూడా పూర్తి చేశాడు. వీటికి సంబంధించి రమేష్‌కు రూ.20 లక్షల బిల్లులు రావాల్సి ఉంది. 

క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు పనులను తనిఖీ చేశాకే బిల్లులు మంజూరవుతాయి. అయితే పనులు తనిఖీ చేసే అధికారులను తీసుకొస్తానని, అందుకు రూ.1.20 లక్షలు లంచం ఇవ్వాలని నవీన్‌కుమార్‌ డిమాండ్‌ చేశాడు. రమేష్‌ పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా అతడిలో మార్పు రాకపోవడంతో విసుగు చెంది ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఇల్లెందుకు చేరుకున్న ఏసీబీ అధికారులు.. రమేష్‌ నుంచి రూ.1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా నవీన్‌కుమార్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కుతరలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. అవినీతి, లంచగొండితనాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజలపై ఉందని అన్నారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే ఏసీబీని సంప్రదించాలని కోరారు. అవసరమైతే టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు ఫోన్‌ చేయాలని సూచించారు. ఆయన వెంట ఏసీబీ సీఐలు రమణమూర్తి, రవీందర్, సిబ్బంది ఉన్నారు.

ప్రైవేట్‌ కార్యాలయం నుంచే కార్యకలాపాలు...
ఇల్లెందులో పని చేస్తున్న కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తమ అవినీతి సామ్రాజ్యాన్ని కొనసాగించేందుకు ప్రైవేటు కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇరిగేషన్‌ ఏఈ నవీన్‌కుమార్‌ కూడా ఇల్లెందు సుభాష్‌నగర్‌లో పాల కేంద్రం వెనుక గల్లీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడి నుంచే తన అవినీతి కార్యకలాపాలను కొనసాగించాడు. ఏసీబీ అధికారులకు పట్టుబడింది కూడా ఈ ప్రైవేట్‌ కార్యాలయంలోనే. ఏఈ ఒక్కరే కాదు.. ఇతర విభాగాల్లో పని చేస్తున్న ఏఈలు, పలు శాఖల అధికారులు కూడా  ప్రైవేట్‌ కార్యాలయాల నుంచే కార్యకలాపాలు సాగిస్తుండడం గమనార్హం.

ఏడాదిలో ఏసీబీకి చిక్కిన ముగ్గురు ఏఈలు..
ఇల్లెందులో ఏడాది కాలంలో ముగ్గురు ఏఈలు ఏసీబీ వలలో చిక్కారు. గత ఏడాది జూలై 29న మున్సిపల్‌ ఏఈ అనిల్, ఈ ఏడాది ఫిబ్రవరి 9న అదే మున్సిపాల్టీలో పని చేస్తున్న ఇన్‌చార్జ్‌ ఏఈ, టెక్నికల్‌ అసిస్టెంట్‌ బాబురావు ఏసీబీకి పట్టుబడ్డారు. ఇప్పుడు  నీటిపారుదల విభాగం ఏఈ నవీన్‌కుమార్‌ దొరికిపోయాడు. ఏడాది కాలంలోనే ముగ్గురు ఏఈలు ఏసీబీ వలలో చిక్కడం చర్చనీయాంశంగా మారింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top