ఏసీబీ వలలో ధర్మపురి ఎస్సై | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో ధర్మపురి ఎస్సై

Published Thu, Nov 1 2018 7:26 AM

ACB  Raids On Dharmapuri Sub Inspector Karimnagar - Sakshi

సాక్షి, ధర్మపురి: ఓ ట్రాక్టర్‌ కేసు విషయంలో రూ.50వేలు లంచంగా డిమాండ్‌ చేసి.. రూ.10వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు జగిత్యాల జిల్లా ధర్మపురి ఎస్సై అంజయ్య. బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఏసీబీ డీఎస్పీ కిరణ్‌కుమార్‌ వెల్లడించారు. పెగడపెల్లి మండలం ఎల్లాపూర్‌కు చెందిన పెద్ది శ్రీరాములు కరీంనగర్‌లో వాహనాల కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. ఈయన గత మార్చి 10న అల్లంకొండ చంద్రయ్యకు చెందిన ట్రాక్టర్‌ను మహీంద్రా ఫైనాన్స్‌ ద్వారా కొనుగోలు చేసి.. స్క్రాప్‌ కింద అమ్మేశాడు. అయితే సదరు ట్రాక్టర్‌పై గతంలో ఇసుక అక్రమ రవాణా చేసినట్లు ధర్మపురిఠాణాలో కేసు నమోదై ఉంది.

ఆ కేసును తిరగదోడిన ఎస్సై అంజయ్య శ్రీరాములుకు గతనెల 19న ఫోన్‌చేశాడు. ఆయన గతనెల 21న ధర్మపురి స్టేషన్‌కు రాగా.. కేసులో ఉన్న ట్రాక్టర్‌ను ఎలా విక్రయిస్తావని దబాయించాడు. రూ.యాభై వేలు లంచం ఇస్తేనే కేసు మాఫీ చేస్తానని, లేదంటే దొంగతనం కింద కేసు నమోదు చేస్తానని భయభ్రాంతులకు గురిచేశాడు. గత నెల 25న మళ్లీ ఫోన్‌ చేయగా.. శ్రీరాములు స్టేషన్‌కు వెళ్లి.. అంతమొత్తం ఇచ్చుకోలేనని వేడుకున్నాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలను రికార్డు చేశాడు. అనంతరం కరీంనగర్‌ చేరుకుని ఏసీబీ డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు. గత నెల 29న ఎస్సై అంజయ్య ఏఎస్సై వాహిద్‌ను కరీంనగర్‌కు పంపించి.. శ్రీరాములు నుంచి డబ్బులు తీసుకురావాలని ఆదేశించాడు.

ఆయన కరీంనగర్‌ రాగా.. రెండురోజుల్లో వచ్చి కలుస్తానని శ్రీరాములు అతడిని పంపించాడు. ఏసీబీ అధికారుల పథకం ప్రకారం.. బుధవారం సాయంత్రం 4.20 గంటలకు ధర్మపురి స్టేషన్‌కు వచ్చిన శ్రీరాములు ఎస్సై అంజయ్యను కలిసి ముందుగా రూ.పదివేలు ఇచ్చాడు. మరో రూ.ఐదువేలు డిమాండ్‌ చేయడంతో ఏటీఎం నుంచి తీసుకొస్తానని చెప్పి.. బయటకొచ్చి ఏసీబీ అధికారులకు చెప్పాడు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు స్టేషన్‌కు చేరుకుని.. ఎస్సై నుంచి రూ.పదివేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అంజయ్యపై కేసు నమోదు చేసి.. గురువారం ఏసీబీ స్పెషల్‌కోర్టుకు అప్పగిస్తామని డీఎస్పీ తెలిపారు. దాడిచేసిన వారిలో ఏసీబీ ఇన్స్‌పెక్టర్‌ వేణుగోపాల్, సంజీవ్‌ తదితరులున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement