
న్యూఢిల్లీ: యువత ఎలాంటి పనీ లేకుండా ఖాళీగా ఉండటం భారత్‌లోనే అధికమని ఐఎమ్‌ఎఫ్ సీనియర్ ఆర్థిక వేత్త జాన్ బ్లూడోర్న్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్‌లోనే అధిక యువ జనం పనీపాటా లేకుండా ఉంటారని, ఏ పనీ లేకుండా ఖాళీగా ఉండే వారి సంఖ్య ఇక్కడ 30 శాతంగా ఉందని వివరించారు. బ్రూకింగ్స్ ఇండియా నిర్వహించిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని లేబర్ మార్కెట్లలో లింగ అసమానత్వం, టెక్నాలజీల మార్పు, ఉద్యోగ నాణ్యత అధ్వానంగా ఉండటం వంటి సమస్యలు ఉన్నట్లు చెప్పారాయన.
టెక్నాలజీ మార్పులు, ఆటోమేషన్ సమస్యల ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే అభివృద్ధి చెందిన దేశాలపైనే అధికమన్నారు. కాగా భారత్‌లో గత నెలలో నిరుద్యోగం 7.2 శాతానికి పెరిగిందని ముంబైకి చెందిన సీఎమ్‌ఐఈ ఇటీవలే వెల్లడించింది. 2017లో భారత్‌లో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ట స్థాయి, 6.1 శాతానికి చేరిందని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ ముసాయిదా నివేదిక పేర్కొంది.