
క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర గురువారం 25 శాతం పైగా పెరిగింది. రష్యా–సౌదీ అరేబియా మధ్య నెలకొన్న ‘ప్రైస్‌వార్’ ఉపశమించే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్నట్లు వచ్చిన వార్తలు దీనికి నేపథ్యం. రష్యా, సౌదీలు 10 మిలియన్ బ్యారల్స్ నుంచి 15 మిలియన్ బ్యారల్స్ వరకూ చమురు ఉత్పత్తి కోత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ట్రంప్ అంచనావేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఒకేరోజు క్రూడ్ ఆయిల్ ఈ స్థాయిలో పెరగడం ఒక రికార్డు. ఈ వార్తరాసే 10 గంటల సమయంలో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర 23% లాభంతో 30.42 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 35.99 డాలర్ల స్థాయినీ చూసింది. ఇక లైట్‌స్వీట్ నైమెక్స్ క్రూడ్ ధర 25 శాతం (4.5 డాలర్లు) లాభంతో 25 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా ఒక దశలో 27.30 డాలర్ల స్థాయినీ తాకింది.
40 డాలర్లకు పైగా పెరిగిన పసిడి...
ఇకమరోవైపు పసిడి ఔన్స్ (31.1 గ్రా) ధర కూడా న్యూయార్క్ ప్యూచర్స్ మార్కెట్‌లో ఈ వార్తరాసే సమయానికి 44 డాలర్లు పెరిగి 1,635 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒకదశలో 1,637 డాలర్లను కూడా చూసింది. కరోనా ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై కొనసాగుతుందన్న అంచనాలు పసిడి పెరుగుదలకు నేపథ్యం.
లాభాల్లో అమెరికా‘ఈక్విటీ’లు
మరోవైపు అమెరికా స్టాక్ మార్కెట్లు ఈ వార్తరాసే 10 గంటల సమయంలో కొంత లాభాల్లో ఉండడం గమనార్హం. అయితే ఇది కేవలం షార్ట్ సెల్లింగ్ ప్రభావమని కొందరు విశ్లేషిస్తున్నారు. మార్కెట్లు బులిష్ ధోరణిలోకి వెళ్లే అవకాశం ఇప్పుడు కనబడ్డంలేదన్నది వారి అభిప్రాయం.