థిసెన్‌క్రప్‌తో టాటా స్టీల్‌ జట్టు

థిసెన్‌క్రప్‌తో టాటా స్టీల్‌ జట్టు


యూరప్‌లో ఉక్కు కార్యకలాపాలు విలీనానికి ఎంవోయూ

50:50 నిష్పత్తిలో జేవీ ఏర్పాటుకు నిర్ణయం

డీల్‌ పూర్తయితే యూరప్‌లో ఉక్కు ఉత్పత్తిలో నంబర్‌ 2 స్థానం




ముంబై: పారిశ్రామిక దిగ్గజాలు టాటా స్టీల్, థిసెన్‌క్రప్‌.. యూరప్‌లోని తమ ఉక్కు ఉత్పత్తి  విభాగాలను విలీనం చేసేందుకు ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా 50:50 నిష్పత్తిలో థిసెన్‌క్రప్‌ టాటా స్టీల్‌ పేరిట జాయింట్‌ వెంచర్‌ కంపెనీని ఏర్పాటు చేయనున్నాయి. ఇది నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగించనుంది.  ఈ డీల్‌ సాకారమైతే ఆర్సెలర్‌ మిట్టల్‌ తర్వాత యూరప్‌లో రెండో అతి పెద్ద ఉక్కు ఉత్పత్తి సంస్థగా థిసెన్‌క్రప్‌ టాటా స్టీల్‌ నిలుస్తుంది.



తాజా ఒప్పందం.. టాటా స్టీల్‌ ఇండియా ఖాతాలను పటిష్టపర్చగలదని, మెరుగైన ఉత్పత్తుల తయారీకి, వృద్ధిపై దృష్టి సారించేందుకు దోహదపడగలదని టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ఈ సందర్భంగా తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ఉత్పత్తి సామర్ధ్యం రెట్టింపు కాగలదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కళింగనగర్‌ (ఒడిషా), జంషెడ్‌పూర్‌లోని రెండు ప్లాంట్లలో వార్షికంగా 13 మిలియన్‌ టన్నుల ఉక్కు ఉత్పత్తి జరుగుతోంది. స్వంతంగా ఎదగడంతో పాటు ఇతర సంస్థలను కూడా కొనుగోలు చేయడం తదితర కార్యకలాపాల ద్వారా వృద్ధి సాధనపై దృష్టి సారించనున్నట్లు చంద్రశేఖరన్‌ చెప్పారు. ఈ డీల్‌తో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు సంబంధించి సామర్థ్యాలు కూడా మెరుగుపడగలవని తెలిపారు.



వచ్చే ఏడాది మార్చి నుంచి మదింపు ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని, డిసెంబర్‌ ఆఖరు నాటికి లేదా 2019 తొలినాళ్లలో గానీ నియంత్రణ సంస్థల అనుమతి లభించగలదని ఆశిస్తున్నట్లు టాటా స్టీల్‌ గ్రూప్‌ ఈడీ కౌశిక్‌ చటర్జీ తెలిపారు. బ్రిటన్, నెదర్లాండ్స్‌లోని ప్లాంట్ల మూసివేతగానీ ఉద్యోగుల తొలగింపుగానీ జరగదని ఆయన చెప్పారు. ‘ప్రతిపాదిత జాయింట్‌ వెంచర్‌ ద్వారా థిసెన్‌క్రప్, టాటా స్టీల్‌ యూరప్‌ విభాగాల పటిష్టమైన భవిష్యత్‌కు బాటలు వేస్తున్నాం. యూరప్‌ ఉక్కు పరిశ్రమలో వ్యవస్థీకృత సవాళ్లను ఎదుర్కొంటూ పటిష్టంగా నంబర్‌ 2 స్థానం దక్కించుకుంటాం‘ అని థిసెన్‌క్రప్‌ సీఈవో హెయిన్‌రిచ్‌ హైసింగర్‌ పేర్కొన్నారు.

2.5 బిలియన్‌ యూరోల రుణ బదలాయింపు..

టాటా స్టీల్‌కి దాదాపు రూ. 77,000 కోట్ల రుణభారం ఉండగా.. ఇందులో సుమారు 2.5 బిలియన్‌ యూరోల మేర (దాదాపు రూ. 19,250 కోట్లు) భారం జాయింట్‌ వెంచర్‌కి బదలాయిస్తారు. మిగతా రుణం టాటా స్టీల్‌ ఇండియా ఖాతాల్లో విదేశీ రుణంగా ప్రతిఫలిస్తుంది. జేవీ సంస్థ ఆదాయాలు 15.9 బిలియన్‌ యూరోలుగాను, స్థూల లాభం 1.56 బిలియన్‌ యూరోలుగాను ఉండనుంది. థిసెన్‌క్రప్‌కి సంబంధించి 3.6 బిలియన్‌ యూరోల మేర పింఛన్లపరమైన భారం కూడా జేవీకి బదలాయించడం జరుగుతుంది. టాటా స్టీల్‌ యూరప్‌లో 18,000 మంది, థిసెన్‌క్రప్‌లో 30,000 మంది సిబ్బంది ఉన్నారు. కొత్త సంస్థకు అంతర్జాతీయంగా 34 ప్రాంతాల్లో 48,000 మంది సిబ్బంది ఉంటారు.



ఆమ్‌స్టర్‌డ్యామ్‌ కేంద్రంగా కార్యకలాపాలు ...

ఎంవోయూ ప్రకారం.. యూరప్‌లో ఇరు కంపెనీల ఫ్లాట్‌ స్టీల్‌ వ్యాపారాలు, థిసెన్‌క్రప్‌కి చెందిన స్టీల్‌ మిల్లు సేవలు జాయింట్‌ వెంచర్‌కి వెళ్తాయి. ప్రతిపాదిత జేవీ.. థిసెన్‌క్రప్‌ టాటా స్టీల్‌ ప్రధాన కార్యాలయం నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యామ్‌లో ఉంటుంది. ప్రీమియం, వైవిధ్యమైన ఉత్పత్తులు సరఫరా చేస్తుంది. వార్షికంగా 21 మిలియన్‌ టన్నుల ఫ్లాట్‌ స్టీల్‌ ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంది. రెండు కంపెనీల కలయికతో 400–600 మిలియన్‌ యూరోల ప్రయోజనం చేకూరనుంది. నగదుయేతర విధానం ద్వారా ఈ లావాదేవీ జరగనున్నట్లు  కౌశిక్‌ చటర్జీ తెలిపారు.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top