టాటా ఉప్పు’... కంపెనీ మారింది! | Tata Chemicals to transfer consumer business to Tata Global Beverages | Sakshi
Sakshi News home page

టాటా ఉప్పు’... కంపెనీ మారింది!

May 16 2019 5:33 AM | Updated on May 16 2019 5:33 AM

Tata Chemicals to transfer consumer business to Tata Global Beverages - Sakshi

న్యూఢిల్లీ: టాటా గ్రూపులో వ్యాపార పునర్వ్యవస్థీకరణ దిశగా ఓ కీలక నిర్ణయం జరిగింది. టాటా కెమికల్స్‌కు చెందిన ఆహారోత్పత్తుల వ్యాపారం టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌లో విలీనం కానుంది. ఈక్విటీ షేర్ల జారీ రూపంలో ఈ వ్యాపార విలీనం ఉంటుందని టాటా కెమికల్స్‌ లిమిటెడ్‌ (టీసీఎల్‌) తెలిపింది. ప్రతీ టాటా కెమికల్‌ షేరుకు 1.14 టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌ షేర్లు కేటాయిస్తారు. టాటా కెమికల్స్‌కు చెందిన ఉప్పు, మసాలాలు, పప్పులు తదితర ఆహారోత్పత్తులను టాటా గ్లోబల్‌ బేవరేజెస్‌ (టీజీబీఎల్‌) పరం అవుతాయి. ఆ తర్వాత టీజీబీఎల్‌ పేరును టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌గా మారుస్తారు. దీంతో రూ.9,099 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన కంపెనీగా టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ అవతరిస్తుంది. ఈ మేరకు టాటా కెమికల్స్, టీజీబీఎల్‌ కంపెనీల బోర్డులు బుధవారం సమావేశమై నిర్ణయాలు తీసుకున్నాయి. టాటా కెమికల్స్‌ నుంచి కన్జ్యూమర్‌ ఉత్పత్తుల వ్యాపారాన్ని వేరు చేసి, టీజీబీఎల్‌కు బదిలీ చేసేందుకు ఆమోదం తెలిపాయి. వాటాదారులు, స్టాక్‌ ఎక్సేంజ్‌లు, నియంత్రణ సంస్థల ఆమోదం అనంతరం ఈ వ్యాపార విలీనం జరుగుతుంది.  

నవ్యత కావాలి...
తన ప్రధాన ఉత్పత్తుల విషయంలో టీజీబీఎల్‌కు నవ్యత అవసరమని ఎన్‌ చంద్రశేఖరన్‌ అన్నారు. మరింత వృద్ధి అవకాశాల కోసం ఎంచుకున్న ప్రాంతాల్లో వ్యాపారాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరపు టీజీబీఎల్‌ కంపెనీ వార్షిక నివేదికలో వాటాదారులను ఉద్దేశించి ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. అవకాశాలను సొంతం చేసుకునే విధంగా భవిష్యత్తు విధానాలు ఉండాలని, అందుకు తగిన విధంగా సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు ఆకాంక్షలను చేరుకునేందుకు శక్తిమంతమైన టాటా బ్రాండ్‌ ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు.

వృద్ధికి మరింత అవకాశం
ఇరు కంపెనీల వినియోగదారుల ఆధారిత వ్యాపారాన్ని ఏకం చేయడం వల్ల ఆహారం, పానీయాల మార్కెట్లో వాటా పెంచుకోవచ్చని, దీనివల్ల రెండు కంపెనీల వాటాదారులు ప్రయోజనం పొందుతారని కంపెనీ నుంచి విడుదలైన ప్రకటన పేర్కొంది. టీజీబీఎల్‌ టాటా టీ, టెట్లే పేరుతో టీ ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఎయిట్‌ ఓ క్లాక్‌ బ్రాండ్‌ కింద కాఫీని, ఇంకా బాటిల్డ్‌ వాటర్, గ్లూకోవిటా తదితర ఉత్పత్తులను సైతం మార్కెట్‌ చేస్తోంది. టాటా కాఫీ కూడా టీజీబీఎల్‌ అనుబంధ సంస్థే. ఇక టాటా కెమికల్స్‌ ప్రపంచంలో మూడో అతిపెద్ద సోడా యాష్‌ తయారీదారు. కన్జ్యూమర్‌ ఉత్పత్తుల వ్యాపారాన్ని డీమెర్జ్‌ చేసిన తర్వాత టాటా కెమికల్స్‌ పూర్తిగా బేసిక్, స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీగా కొనసాగుతుంది. ‘‘ఎఫ్‌ఎంసీజీ విభాగంలో ఫుడ్, బేవరేజెస్‌ పరంగా టాటా కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌ స్థానం బలపడుతుంది. దేశీయ వినియోగదారుల పెరుగుతున్న ఆకాంక్షలను చేరుకునేందుకు ఈ విలీనం ద్వారా బలమైన ప్లాట్‌ఫామ్‌ ఏర్పాటు చేశాం’’ అని టాటా గ్రూపు చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement