అతి తెలివి వద్దు... మీకూ ఇళ్లు లేకుండా చేస్తాం!

Supreme Court warns Amrapali group not to play smart with court - Sakshi

ఆమ్రపాలి గ్రూపు డైరెక్టర్లకు  సుప్రీం కోర్టు హెచ్చరిక

కొనుగోలుదార్లను పట్టించుకోకపోవడంపై ఆగ్రహం  

న్యూఢిల్లీ: గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ, ప్రాజెక్టులను ఆలస్యం చేస్తున్న రియల్టీ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌ డైరెక్టర్లకు అత్యున్నత న్యాయస్థానం తీవ్ర హెచ్చరికలు చేసింది. అతితెలివి ప్రదర్శించవద్దని, గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను పట్టించుకోకుండా ఆటలాడవద్దని స్పష్టంచేసింది. అలా చేస్తే డైరెక్టర్లకూ ఇళ్లు లేకుండా చేస్తామని హెచ్చరించింది. గ్రూప్‌ పెండింగ్‌ రియల్టీ ప్రాజెక్టులకు సంబంధించి గృహ కొనుగోలుదారుల ప్రయోజనాల పరిరక్షణకు మేనేజింగ్‌ డైరెక్టర్లు, డైరెక్టర్ల ప్రతి ఒక్క ఆస్తినీ అమ్ముతామని, తద్వారా డబ్బును రికవరీ చేయిస్తామని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ యూయూ లలిత్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘కొనుగోలుదారులు వారి గృహాలను సొంతం చేసుకునే విషయంలో మీ నుంచి జరుగుతున్న ఆలస్యమే ప్రస్తుతం సమస్య. అతి తెలివి ప్రవర్తించవద్దు. మీ ప్రతి ఒక్క ఆస్తినీ విక్రయిస్తాం. మిమ్మల్నీ ఇళ్లు లేని వారిని చేస్తాం. మీరు గృహ కొనుగోలుదారుల  విషయంలో చేసినట్లే, మీ ఆస్తికోసం మీరూ ఎదురుచూసేలా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ద్విసభ్య ధర్మాసనం హెచ్చరించింది. 

రూ.4,000 కోట్లకు రూ. 400 కోట్లేమిటి? 
పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి రూ.4,000 కోట్ల వ్యయమవుతుందని అంచనా. అయితే ఇందుకు సంబంధించి రూ.400 కోట్ల విలువైన కమర్షియల్‌ ఆస్తుల విక్రయానికి ఆమ్రపాలి గ్రూప్‌ చేసిన ప్రతిపాదన పట్ల ద్విసభ్య ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2008లో ఒక ప్రాపర్టీకి ఒక గృహ కొనుగోలుదారు రూ.50 లక్షలు వెచ్చిస్తే, ఇప్పుడు దాని విలువ రూ.2.5 కోట్లవుతుందనీ, రూ. కోటి వెచ్చిస్తే, దాని విలువ ఇప్పుడు రూ. 4 కోట్లని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొంది.  

ఆస్తుల వివరాలకు ఆదేశం 
కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్లు, డైరెక్టర్లు అందరూ తమ స్థిర, చర ఆస్తుల వివరాలను 15 రోజులలోపు సమర్పించాలని ఈ సందర్భంగా బెంచ్‌ స్పష్టం చేసింది. వాటి విలువల రిపోర్ట్‌నూ న్యాయస్థానం ముందుంచాలని పేర్కొంది. అలాగే రూ.4,000 కోట్ల ప్రాజెక్టుల పూర్తికి సుస్పష్టమైన ప్రతిపాదనలనూ ఆగస్టు 14వ తేదీలోపు తన ముందు ఉంచాలని గ్రూప్‌నకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే 2008 నుంచి నిర్వహణలో ఉన్న గ్రూప్‌ కంపెనీలు, డైరెక్టర్ల బ్యాంక్‌ అకౌంట్ల వివరాలతో ఒక అఫిడవిట్‌ను సమర్పించాలని కూడా గ్రూప్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.  

14వ తేదీన తదుపరి విచారణ 
ఇళ్ల కొనుగోలుదారుల నుంచి రూ.6,119 కోట్లను గ్రూప్‌ సమీకరించగలదని ఆమ్రపాలి తరఫు న్యాయవాది గౌరవ్‌ భాటియా చేసిన వాదనపై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఇందుకు తాము అంగీకరించబోమని స్పష్టం చేసింది. ఫ్లాట్స్‌ అందజేతలో ఆలస్యం అవుతున్నందుకుగాను ఆమ్రపాలినే గృహ కొనుగోలుదారులకు డబ్బు చెల్లించాలని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణ 14వ తేదీకి వాయిదాపడింది. ఆమ్రపాలి గ్రూప్‌ 42,000 మందికి ఫ్లాట్లను బదలాయించాల్సి ఉంది. గ్రూపునకు చెందిన పనులను నిర్వహించేందుకు  ప్రభుత్వరంగంలోని ఎన్‌బీసీసీకి ఇప్పటికే సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అందుకు ఆమ్రపాలి గ్రూప్‌ నిధులు సమకూర్చాల్సి ఉంటుంది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top