ఫలితాలకు ముందు అప్రమత్తత | Stock market update: 52 stocks hit 52-week lows on NSE | Sakshi
Sakshi News home page

ఫలితాలకు ముందు అప్రమత్తత

May 23 2019 12:45 AM | Updated on May 23 2019 12:45 AM

 Stock market update: 52 stocks hit 52-week lows on NSE - Sakshi

ఎన్నికల ఫలితాలకు ముందు ఇన్వెస్టర్లలో అప్రమత్తత కారణంగా స్టాక్‌ మార్కెట్‌ బుధవారం తీవ్రమైన ఒడిదుడుకులకు గురైంది. ఆద్యంతం తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురైన సెన్సెక్స్, నిఫ్టీలు చివరకు లాభాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 345 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 140 పాయింట్ల లాభంతో 39,110 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 11,738 పాయింట్ల వద్దకు చేరింది. స్వల్పంగానైనా డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరగడం సానుకూల ప్రభావం చూపించింది.  

అప్రమత్తంగా ఉండండి... 
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏనే మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయని పలు ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించడం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతుండటంతో ఈ వారం మార్కెట్‌ సెంటిమెంట్‌ పాజిటివ్‌గా మారిందని పలువురు విశ్లేషకులు పేర్కొన్నారు. బీజేపీకి మెజారిటీ రాకపోతే మాత్రం, మార్కెట్‌  మూడ్‌కు విఘాతం కలుగుతుందని షేర్‌ఖాన్‌ బై బీఎన్‌పీ పారిబా విశ్లేషకులు హేమాంగ్‌ జని హెచ్చరించారు. ఎగ్జిట్‌ పోల్స్‌కు అనుగుణంగా ఫలితాలు రాకపోతే సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పతనమవుతాయని నిపుణులంటున్నారు. ఫలితాల సరళిని బట్టి ప్రధాన సూచీలు 10 శాతం పైకి గానీ, దిగువకు గానీ తీవ్రమైన హెచ్చుతగ్గులకు గురవుతాయని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.  

345 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌... 
సెన్సెక్స్‌ లాభాల్లోనే ఆరంభమైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే నష్టాల్లోకి జారిపోయింది. మళ్లీ పుంజుకొని లాభాల్లోకి వచ్చింది. హెచ్చుతగ్గులకు లోనైంది. మధ్యాహ్నం తర్వాత మళ్లొకసారి నష్టాల్లోకి జారిపోయింది. ఆ వెంటనే మళ్లీ లాభాల్లోకి వచ్చింది. ఒక దశలో 66 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ మరో దశలో 279 పాయింట్లు లాభపడింది. మొత్తం మీద రోజంజా 345 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. 

►ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్‌ 4.8 శాతం లాభంతో రూ.1,518 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే.  
► తాజాగా ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించడం ఆపేశామని, అలాగే డిపాజిట్ల రెన్యూవల్‌ను కూడా నిలిపేశామని వెల్లడించడంతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్‌ 9 శాతం నష్టంతో రూ.118 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్‌ 18% నష్టంతో రూ.107ను తాకింది.  
►జెట్‌ ఎయిర్‌వేస్‌ను మళ్లీ నిలబెట్టడానికి ఆదిగ్రో ఏవియేషన్‌తో ఇతిహాద్‌ ఎయిర్‌వేస్, హిందుజా గ్రూప్, జెట్‌ ఎయిర్‌వేస్‌ చేతులు కలుపనున్నారన్న వార్తలో జెట్‌ ఎయిర్‌వేష్‌ షేర్‌ 5% లాభంతో రూ.159 వద్దకు చేరింది. ఈ వారంలో ఈ షేర్‌ 32 శాతం పెరగడం విశేషం.  
​​​​​​​► ఎల్‌ అండ్‌ టీ షేర్‌ ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హై, రూ.1,473ను తాకింది. చివరకు 0.8 శాతం లాభంతో రూ.1,461 వద్ద ముగిసింది.

మరింత పర్యవేక్షణ
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో స్టాక్‌  ఎక్సే్చంజ్‌లు, మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీలు నిఘా, పర్యవేక్షణను మరింతగా పెంచాయి. ఎన్నికల ఫలితాల కారణంగా స్టాక్‌ మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు చోటు చేసుకోగలవని, తప్పుదారి పట్టించే ట్రేడింగ్‌ వ్యూహాలు చోటు చేసుకోగలవని, వీటిని నివారించడానికి నిఘా చర్యలను మరింతగా పెంచినట్లు సెబీ పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement