స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల రికార్డు, టాప్‌ బ్రాండ్‌ ఇదే

Smartphone shipments hit record high of 49 million, Xiaomi most dominant brand in Q3  - Sakshi

2019 క్యూ3లో  5 కోట్ల స్మార్ట్‌ఫోన్ల రికార్డు అమ్మకాలు

రారాజుగా చైనా దిగ్గజం  షావోమి

వెలవెల  బోయిన  ఫీచర్‌ఫోన్‌ మార్కెట్‌

సాక్షి, ముంబై : దసరా, దీపావళి పండుగ సీజన్లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించడంతో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ అమ్మకాలు జోరందుకున్నాయి.  కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడయింది. అన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కొత్త లాంచ్‌లు, డిస్కౌంట్లు, పండుగ ప్రత్యేక ఆఫర్లతో ఈ వృద్ధి నమోదైందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఒక నివేదికలో తెలిపింది.  డిస్కౌంట్లు,  క్యాష్‌బ్యాక్, నో కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, ఆకర్షణీయమైన ప్రమోషన్లు ఈ పండుగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పెంచడంతో కీలకంగా నిలిచిందని కౌంటర్ పాయింట్  విశ్లేషకుడు అన్షిక జైన్ చెప్పారు.

ఒకవైపు దేశీయంగా ఆటో, రియల్టీ సహా పలురంగాల్లో మందగమనం కొనసాగుతోంటే..స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ మాత్రం రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. జూలై-సెప్టెంబర్ 2019 త్రైమాసికంలో రెండంకెల (10 శాతం) వృద్దితో అత్యధికంగా 49 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఫలితంగా ఈ విభాగంలో మందగమనం ఆందోళనలను అధిగమించిందని ఇటీవల వెల్లడించిన ఒక నివేదికలో  పేర్కొంది. 

ముఖ్యంగా ఈ విక్రయాల్లో చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి తన ఆధిపత్యాన్ని మరోసారి నిలబెట్టుకుంది. ఆకర్షణీయమైన అత్యాధునిక ఫీచర్లు, బడ్జెట్‌ ధరల్లో వివిధ స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తూ భారతీయ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. కౌంటర్ పాయింట్ వెల్లడించిన వివరాల ప్రకారం  షావోమి మార్కెట్ వాటా 26 శాతంటాప్‌లో  నిలిచింది.  20 శాతం వాటాతో శాంసంగ్ , 17 శాతంతో వివో తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి.  ఇంకా రియల్ మీ 16 శాతం, ఒప్పో వాటా 8 శాతంగా  సాధించాయి. అయితే ఇటావల ధరలను తగ్గించిన నేపథ్యంలో ఆపిల్‌ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు పుంజుకున్నాయి. ఐఫోన్ 11 తో పాటు ఎక్స్‌ఆర్ మోడల్‌లో ధరల తగ్గింపు కారణంగా ఆపిల్ టాప్ 10 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలోకి ప్రవేశించింది. అయితే నెంబర్ వన్ ప్రీమియం  స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌గా వన్ ప్లస్ నిలిచింది. మూడో త్రైమాసికంలో ఈ కంపెనీ అమ్మకాలు రెండింతలు పెరిగాయి. 

 క్షీణించిన ఫీచర్‌ ఫోన్ మార్కెట్‌
స్మార్ట్ ఫోన్ల కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఫీచర్ ఫోన్ల అమ్మకాలు  అంతంతమాత్రమే.  మూడో త్రైమాసికంలో దాదాపు 37 శాతం తగ్గిపోయాయి. ఫీచర్ ఫోన్ విభాగంలో శాంసంగ్ మార్కెట్ వాటా 22 శాతం, ఐ టెల్ వాటా 16 శాతం, లావా వాటా 16 శాతం, నోకియా 12 శాతం, కార్బన్ 7 శాతంగా నమోదైంది. అయితే  ఇటెల్, లావా కార్బన్ కంపెనీలు సానుకూల వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. వాస్తవానికి, 2019 మూడవ త్రైమాసికంలో ఇటెల్ రెండవ ఫీచర్ ఫోన్ బ్రాండ్‌గా అవతరించిందని  కౌంటర్ పాయింట్ పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top