
సెన్సెక్స్ తిరిగి 28,000పైకి..
జీఎస్‌టీ బిల్లుకు సంబంధించిన కీలక అంశాల్లో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో బుధవారం మార్కెట్ స్వల్పంగా కోలుకుంది.
• జీఎస్‌టీ బిల్లుపై ఏకాభిప్రాయంతో జోష్
• 12 నెలల గరిష్ట స్థాయిని తాకిన నిఫ్టీ
ముంబై : జీఎస్‌టీ బిల్లుకు సంబంధించిన కీలక అంశాల్లో కేంద్రం, రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరడంతో బుధవారం మార్కెట్ స్వల్పంగా కోలుకుంది. బ్యాంక్ ఆఫ్ జపాన్ నుంచి ఉద్దీపన ప్యాకేజీ వుంటుందన్న అంచనాలతో ఆసియా, యూరప్ మార్కెట్లు పెరగడం కూడా ఇక్కడి సెంటిమెంట్‌ను బలపర్చింది. బ్యాంక్ ఆఫ్ జపాన్ సమావేశం వచ్చే శుక్రవారం జరుగుతుంది. ఈ సమావేశానికి ముందే 265 బిలియన్ డాలర్ల ఉద్దీపనను జపాన్ ప్రధాని షింజో అబే ప్రతిపాదించడం మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. అయితే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ కమిటీ బుధవారం రాత్రి వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడుతున్నారని, దాంతో ఇతర పాజిటివ్ వార్తలున్నా, మార్కెట్ భారీగా పెరగలేదని విశ్లేషకులు చెప్పారు.
8,665 పాయింట్ల వద్దకు నిఫ్టీ...
బీఎస్‌ఈ సెన్సెక్స్ 28,210-27,900 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనై, చివరకు 48 పాయింట్ల లాభంతో 28,024 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12 నెలల గరిష్టస్థాయి 8,665 పాయింట్ల స్థాయిని తాకడం విశేషం. గతేడాది జులై తర్వాత ఈ స్థాయిని నిఫ్టీ చేరడం ఇదే ప్రధమం. ఈ సూచి చివరకు 25 పాయింట్ల లాభంతో 8,616 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. జులై డెరివేటివ్ కాంట్రాక్టులు గురువారం ముగియనున్నందున, షార్ట్ కవరింగ్ ఫలితంగా ఇంట్రాడేలో సూచీల గరిష్టస్థాయికి పెరిగాయని ట్రేడర్లు చెప్పారు.
హెచ్‌డీఎఫ్‌సీ అప్..
తాజాగా ఆర్థిక ఫలితాలు వెల్లడించిన హెచ్‌డీఎఫ్‌సీ 1.5 శాతం పెరిగి, దాదాపు 52 వారాల గరిష్టస్థాయి రూ. 1,388 వద్ద ముగిసింది. క్రితం రోజు నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించిన డాక్టర్ రెడ్డీస్ లాబ్ మరో 10 శాతం పతనమై రూ. 2,988 వద్ద క్లోజయ్యింది.