అనిశ్చితి.. ఆటుపోట్లు ఉంటాయ్‌

Sakshi Interview About Motilal Oswal Financial Services md Ajay Menon

ఎంవోఎస్‌ఎల్‌ ఎండీ అజయ్‌ మీనన్‌

మార్కెట్‌ కాస్త పెరిగినా... ర్యాలీ కాకపోవచ్చు

హెల్త్‌కేర్, ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ స్టాక్స్‌ పరిశీలించవచ్చు

క్రూడాయిల్‌ కాంట్రాక్టులు నిలిపివేశాం...

కరోనా వైరస్‌పరమైన ప్రభావాలు మరికొన్నాళ్ల పాటు ఉంటాయని.. మధ్యలో మార్కెట్లు పెరిగినా.. బుల్‌ ర్యాలీ ప్రారంభంగా భావించడానికి లేదంటున్నారు మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌(ఎంవోఎస్‌ఎల్‌) ఎండీ, సీఈవో (బ్రోకింగ్, డిస్ట్రిబ్యూషన్‌) అజయ్‌ మీనన్‌. అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగా దేశీ మార్కెట్లలోనూ ఆటుపోట్లు తప్పకపోవచ్చని సాక్షి బిజినెస్‌ బ్యూరోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు ఆ వివరాలివీ..

స్టాక్‌ మార్కెట్లపై మీ అంచనాలేంటి?
దేశీయంగా ఇప్పటికే వృద్ధి మందగించిన తరుణంలో లాక్‌డౌన్‌ కారణంగా మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లకు లోనవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రభుత్వాలు ఇటు ద్రవ్య, అటు ఆర్థికపరమైన చర్యలు తీసుకుంటున్నాయి. దీనితో మందగమన ప్రతికూల ప్రభావాల తీవ్రత మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. సమీప భవిష్యత్‌లో సంస్థాగత ఇన్వెస్ట్‌మెంట్‌లు మార్కెట్లకు దిశా నిర్దేశం చేయొచ్చు. మార్కెట్లకు స్వల్పకాలిక స్థిరత్వం లభించినా.. మొత్తం మీద ఆర్థిక మందగమనం, అంతర్జాతీయ పరిణామాలతో ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షన్లు ఉండొచ్చు.

విధానపరమైన నిర్ణయాలు, అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాలు, వైరస్‌ వ్యాప్తి, స్వల్ప..మధ్యకాలికంగా కంపెనీల పనితీరు వంటి అంశాలు సమీప భవిష్యత్‌లో మార్కెట్లకు దిశా నిర్దేశం చేయొచ్చు.     ప్రస్తుతం మార్కెట్‌ స్వల్పకాలికంగా 7,500 స్థాయి దగ్గర బాటమ్‌ అవుట్‌ అయినట్లుగా అనిపిస్తోంది. మార్చిలో పదకొండేళ్ల గరిష్ట స్థాయి 87కి ఎగిసిన వొలటాలిటీ ఇండెక్స్‌ ప్రస్తుతం 40 స్థాయికి దిగి రావడం దీనికి నిదర్శనం. భయాందోళనలు తగ్గుముఖం పడుతున్నాయనడానికి నిదర్శనంగా మార్కెట్లు 50 శాతం పైగా కరెక్టయ్యాయి. అయితే, స్వల్పకాలిక పెరుగుదలను బుల్‌ ర్యాలీ ప్రారంభానికి సంకేతంగా భావించడానికి లేదు. అంతర్జాతీయ పరిస్థితులు చూస్తే ఇంకా అనిశ్చితి, బలహీనతే కనిపిస్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లోనూ తీవ్ర ఆటుపోట్లు తప్పకపోవచ్చు.  
 
క్యూ4లో కంపెనీల ఆర్థిక ఫలితాలపై అంచనాలు?

ప్రస్తుతం నెలకొన్న పరిíస్థితుల్లో ఆర్థిక ఫలితాల అంచనాలను పలు మార్లు సవరించాల్సి రావొచ్చు. చమురు ధరల తగ్గుదల, వ్యయ నియంత్రణ చర్యలు.. కంపెనీల ఆదాయాలకు కాస్త తోడ్పాటుగా ఉండొచ్చు. మొత్తం మీద నాలుగో త్రైమాసికంలో హెల్త్‌కేర్, కన్జూమర్‌ స్టేపుల్స్‌ వంటి రంగాల సంస్థలు, ఐసీఐఐసీ బ్యాంక్, ఎస్‌బీఐ వంటి కొన్ని దిగ్గజ బ్యాంకులు తక్కువ బేస్‌ కారణంగా మెరుగైన ఫలితాలు ప్రకటించవచ్చని భావిస్తున్నాం. ఆటో, మెటల్స్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ తదితర రంగాలు వెనుకబడవచ్చు. లాక్‌డౌన్‌ సంబంధ పరిణామాల వల్ల.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఆదాయాల రికవరీ గొప్పగా ఉండకపోవచ్చు.

ఏయే స్టాక్స్‌ పరిశీలించవచ్చు?
ప్రస్తుత పరిస్థితుల్లో కన్జూమర్, ఐటీ, ఫార్మా, ఎంపిక చేసిన కొన్ని పెద్ద ప్రైవేట్‌ బ్యాంకుల స్టాక్స్‌తో పోర్ట్‌ఫోలియోను కాస్త రక్షణాత్మక ధోరణిలో రూపొందించుకోవడం శ్రేయస్కరం. అంతర్జాతీయ, దేశీయ ఎకానమీ మెరుగుపడేదాకా ఇన్‌ఫ్రా, కమోడిటీ రంగాలు అండర్‌పెర్ఫార్మ్‌ చేసే అవకాశం ఉంది. ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులకు డిమాండ్‌ ఎలాగూ ఉంటుంది కాబట్టి ఆ రంగ సంస్థలు మెరుగ్గా ఉండొచ్చు. హెచ్‌యూఎల్, నెస్లే, డాబర్, టాటా, కన్జూమర్‌ తదితర సంస్థలను పరిగణించవచ్చు. అలాగే హెల్త్‌కేర్‌ గత రెండేళ్లుగా తీవ్ర ఒత్తిళ్లకు లోనైనప్పటికీ.. కరోనా వైరస్‌ కారణంగా ఈ రంగానికి కొత్త అవకాశాలు వచ్చాయి. డాక్టర్‌ రెడ్డీస్, దివీస్‌ ల్యాబ్, ఇప్కా ల్యాబ్స్, అల్కెమ్, డాక్టర్‌ లాల్‌ పాథ్‌ల్యాబ్స్, ఐసీఐసీఐ లాంబార్డ్‌ వంటివి పరిశీలించవచ్చు.

వర్క్‌ ఫ్రం హోమ్‌ లాంటి పరిణామాల వల్ల టెలికం సేవలకు డిమాండ్‌ పెరిగింది. భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్‌ (జియో కారణంగా) ఎంచుకోవచ్చు. ఇక క్రూడ్‌ రేట్లు దశాబ్దాల కనిష్ట స్థాయిలకు పడిపోవడంతో ముడివస్తువుల రేట్లు తగ్గి ఏషియన్‌ పెయింట్స్, పిడిలైట్‌ వంటి క్రూడ్‌ డెరివేటివ్‌ వినియోగ సంస్థలకు ప్రయోజనాలు లభిస్తాయి. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకులను.. ఎన్‌బీఎఫ్‌సీల్లో హెచ్‌డీఎఫ్‌సీ వంటివి ఎంచుకోవచ్చు. టెక్నాలజీ రంగానికి సంబంధించి వచ్చే కొద్ది త్రైమాసికాల్లో ఆటుపోట్లు ఉన్నప్పటికీ.. ఎకానమీ మెరుగుపడే కొద్దీ ఐటీపై వ్యయాలూ మళ్లీ పెరగవచ్చు. ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్‌ టెక్‌ వంటివి పరిశీలించవచ్చు.  

సాధారణ పరిస్థితులు తిరిగొచ్చే దాకా మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంటాయి. సమీప భవిష్యత్‌లో మార్కెట్లు తగ్గొచ్చు. అయితే, ఎంతదాకా పడతాయన్నది చెప్పడం కష్టం. ఇలాంటప్పుడు చిన్న ఇన్వెస్టర్లు.. ఫండమెంటల్స్‌ పటిష్టంగా ఉన్న నాణ్యమైన షేర్లను కొద్ది కొద్దిగా జోడించుకుంటూ వెళ్లొచ్చు.  

ఇటీవలి క్రూడాయిల్‌ రేట్ల భారీ పతన ప్రభావాలను మీ సంస్థ ఎలా ఎదుర్కొంది?
క్రూడాయిల్‌లో ట్రేడింగ్‌ చేసే క్లయింట్లు మాకు చాలా మందే ఉన్నారు. ధర సున్నా స్థాయికి పడిపోయే దాకా కూడా లావాదేవీల నిర్వహణకు మాకు పూర్తి కవరేజీ ఉంది. ఇంట్రాడే రిస్కులను భరించగలిగేలా మా రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ పటిష్టంగా ఉంది. అయితే, ముగింపు ధర, సెటిల్మెంట్‌ ధరకు మధ్య ఏకంగా 400% వ్యత్యాసం ఏర్పడటం ఎవరూ ఊహిం^è లేనిది. రాత్రికి రాత్రి ఎక్సే్చంజీలు మాపైనా, క్లయింట్లపైనా ఈ భారం మోపాయి. ఇంత భారీ రిస్కులు ఎదుర్కొనేందుకు ఏ బ్రోకరేజీ సంస్థకు కవరేజీ ఉండదు. ఈ నేపథ్యంలోనే ఇన్వెస్టర్లు అనవసరంగా రిస్కుల్లో పడకుండా చూసేందుకు ఈ నెల క్రూడాయిల్‌ కాంట్రాక్టులు నిలిపివేశాం.

లాక్‌డౌన్‌ వేళ క్లయింట్లకు సర్వీసులు ఎలా అందిస్తున్నారు?
మా అడ్వైజర్లు, రిలేషన్‌షిప్‌ మేనేజర్లంతా డిజిటల్‌ మాధ్యమం ద్వారా సదా అందుబాటులో ఉంటున్నారు. సర్వీసుల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా మా సిబ్బంది అంతా పూర్తిగా కృషి చేస్తున్నారు. ఏప్రిల్‌ 20 నుంచి దేశవ్యాప్తంగా గ్రీన్‌ జోన్, ఆరెంజ్‌ జోన్లలోని 24 కార్యాలయాలను తిరిగి ప్రారంభించాం. 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top