మరో సంచలనానికి జియో రెడీ | Reliance Jio Bets Big On Laptops With Cellular Connections | Sakshi
Sakshi News home page

మరో సంచలనానికి సిద్ధమైన జియో

Apr 12 2018 1:38 PM | Updated on Apr 12 2018 9:08 PM

Reliance Jio Bets Big On Laptops With Cellular Connections - Sakshi

ముఖేష్‌ అంబానీ - రిలయన్స్‌ జియో (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : సంచలనాలకు మారుపేరుగా రిలయన్స్‌ జియో మార్కెట్‌లో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. టెలికాం సర్వీసులు, స్మార్ట్‌ఫోన్లు, 4జీ ఫీచర్‌ ఫోన్‌ వంటి వాటితో ఇప్పటికే మార్కెట్‌లో తిరుగులేకుండా ఉన్న జియో.. ల్యాప్‌టాప్‌లతో మరో సంచలనానికి తెరతీయబోతోందని తెలుస్తోంది. తన ఆర్పూ(యావరేజ్‌ రెవెన్యూ ఫర్‌ యూజర్‌)ను పెంచుకోవడం కోసం సిమ్‌ కార్డుతో ల్యాప్‌టాప్‌ను ప్రవేశపెట్టాలని చూస్తోంది. దీనిపై ఇప్పటికే అమెరికా చిప్‌ దిగ్గజం క్వాల్‌కామ్‌తో ముఖేష్‌ అంబానీకి చెందిన ఈ కంపెనీ చర్చలు కూడా జరిపిందని తెలిసింది. బిల్ట్‌-ఇన్‌ సెల్యులార్‌ కనెక్షన్స్‌తో విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో నడిచే ల్యాప్‌టాప్‌లను ఇది మార్కెట్‌లోకి ప్రవేశపెడుతుందని రిపోర్టులు పేర్కొన్నాయి. క్వాల్‌కామ్‌ ఇప్పటికే 4జీ ఫీచర్‌ ఫోన్‌ కోసం జియోతో కలిసి పనిచేస్తోంది. 

‘జియోతో మేము మాట్లాడాం. డేటా, కంటెంట్‌తో కూడిన ఒక డివైజ్‌ను వారు తేవాలనుకుంటున్నారు’ అని క్వాల్‌కామ్‌ టెక్నాలజీస్‌ ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సీనియర్‌ డైరెక్టర్‌ మిగ్యుల్ న్యున్స్ చెప్పారు. ఈ చీప్‌మేకర్‌ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(ఐఓటీ) బ్రాండ్‌ స్మార్ట్రాన్‌తో కూడా పనిచేస్తోంది. సెల్యులార్‌ కనెక్టివిటీతో స్నాప్‌డ్రాగన్‌ 835 అందించే ల్యాప్‌టాప్‌లను ఇది ప్రవేశపెట్టబోతోంది. ఈ చర్చలను స్మార్ట్రాన్‌ కూడా ధృవీకరించింది. గ్లోబల్‌గా హెచ్‌పీ, ఆసుస్‌, లెనోవో వంటి కంపెనీలతో కూడా క్వాల్‌కామ్‌ పనిచేస్తోంది. అయితే ఈ విషయంపై స్పందించడానికి రిలయన్స్‌ జియో నిరాకరించింది. 

ఆపరేటర్లు తమ ఆర్పూను పెంచుకోవడానికి తర్వాత డివైజ్‌లు, సెల్యులార్‌ కనెక్టెడ్‌ ల్యాప్‌టాప్‌లేనని కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ డివైజస్‌, ఎకోసిస్టమ్స్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ నైల్‌ షా అన్నారు. కౌంటర్‌పాయింట్‌ డేటా ప్రకారం ప్రతేడాది భారత్‌లో 50 లక్షల ల్యాప్‌టాప్‌లు అమ్ముడుపోతున్నాయని తెలిసింది. వీటిని సెల్యులార్‌ నెట్‌వర్క్‌లకు కనెక్ట్‌ చేస్తే, వీటి విలువ పెరిగి, ఈ రంగంలో వృద్ధిని నమోదు చేయవచ్చని పేర్కొన్నారు. వైఫై హాట్‌స్పాట్లతో పోలిస్తే, సెల్యులార్‌ కనెక్టివిటీ ఎక్కువ భద్రంగా ఉంటుందని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement