మారుతీ 5000 కార్ల విక్రయం- షేరు అప్‌

Maruti sold 5000 cars- share up - Sakshi

లాక్‌డవున్‌ సడలింపుల ఎఫెక్ట్‌- 55 రోజుల తదుపరి గురుగ్రామ్‌ ప్లాంటు ఓపెన్‌- 3 శాతం బలపడిన మారుతీ సుజుకీ షేరు- టొరంట్‌ పవర్‌ షేరుకి ఫలితాల దన్ను

కరోనా వైరస్‌ కట్టడికి విధించిన లాక్‌డవున్‌ను పొడిగించినప్పటికీ కొన్ని ఆంక్షలను సడలించడంతో పలు రంగాలలో ఉత్పత్తి కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. లాక్‌డవున్‌ కారణంగా 55 రోజుల తదుపరి హర్యానాలోని గురుగ్రామ్‌ ప్లాంటులో కార్ల తయారీని ప్రారంభించినట్లు మారుతీ సుజుకీ పేర్కొంది. అంతేకాకుండా గత కొద్ది రోజులలో 5,000 కార్లకుపైగా విక్రయించగలిగినట్లు తెలియజేసింది. దేశవ్యాప్తంగా 1350 షోరూములు తిరిగి ప్రారంభమైనట్లు వెల్లడించింది.వీటికి జతగా 300 ట్రూవేల్యూ ఔట్‌లెట్లను సైతం ఇటీవల తిరిగి తెరిచినట్లు తెలియజేసింది.ఈ బాటలో ఈ నెల 12 నుంచి మనేసర్‌ ప్లాంటులో పాక్షిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేసింది. ఈ వార్తల నేపథ్యంలో మారుతీ సుజుకీ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు ఉదయం 11.30 ప్రాంతంలో 2.25 శాతం లాభపడి రూ. 4827 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 4,900 వరకూ ఎగసింది.ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలి గంటలోనే మారుతీ కౌంటర్లో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో కలిపి 0.72 మిలియన్‌ షేర్లు చేతులు మారాయి.   

టొరంట్‌ పవర్‌- క్యూ4
గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు చూపడంతో టొరంట్‌ పవర్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 6 శాతం జంప్‌చేసి రూ. 315 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 318ను సైతం అధిగమించింది. క్యూ4(జనవరి-మార్చి)లో కంపెనీ నిర్వహణ లాభం(ఇబిటా) 15 శాతం పుంజుకుని రూ. 864 కోట్లను తాకింది. అయితే రూ. 693 కోట్ల పన్నుకు ముందు నష్టం(పీబీటీ) ప్రకటించింది.ఇందుకు 1200 మెగావాట్ల డీజెన్‌ పవర్‌ ప్రాజెక్ట్‌పై నమోదైన రూ. 1000 కోట్ల రైటాఫ్‌ వ్యయాలు కారణమైనట్లు కంపెనీ పేర్కొంది. దీంతో రూ. 270 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కాగా.. క్యూ4లో మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 2984 కోట్లకు చేరింది. ఈ కాలంలో కంపెనీ విద్యుదుత్పత్తి సామర్ధ్యాన్ని 3703 మెగావాట్ల నుంచి 3879 మెగావాట్లకు పెంచుకుంది. కొత్తగా జత కలసిన సామర్థ్యం పునరుత్పాదక ఇంధన విభాగం నుంచి సమకూర్చుకోవడం కంపెనీకి లబ్దిని చేకూర్చనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top